మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..

మీ శరీరంలో ఈ ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయా? సాధారణమైనవే అనుకుని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ముప్పు కావచ్చు.. చాలామంది ఒంటిపై వచ్చే చిన్న చిన్న నొప్పులను లేదా అలసటను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ శరీరం ఇచ్చే కొన్ని అసాధారణ హెచ్చరికలు భవిష్యత్తులో రాబోయే ప్రాణాంతక వ్యాధులకు ముందస్తు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..
Sudden Body Changes You Should Never Ignore

Updated on: Jul 18, 2026 | 10:00 PM

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అయితే మన శరీరంలో కలిగే కొన్ని ఆకస్మిక, అసాధారణ మార్పులను మనం ఎప్పుడూ సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఛాతీ నొప్పి – శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మీకు ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి లేదా బిగుతుగా అనిపిస్తే దానిని అస్సలు లైట్ తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ నొప్పి ఛాతీ నుండి ఎడమ చేయి, దవడ లేదా వీపు భాగానికి వ్యాపిస్తున్నట్లు అనిపిస్తే.. అది గుండెపోటుకు స్పష్టమైన సంకేతం కావచ్చు. దీనితో పాటు అకస్మాత్తుగా తీవ్రమైన ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి ఉంటే అది తీవ్రమైన గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యను సూచిస్తుంది. ఇలాంటి సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఎలాంటి కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం

డైటింగ్ చేయడం లేదా రోజూ వ్యాయామం చేయడం వంటి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గడం ప్రమాదానికి హెచ్చరిక. తక్కువ సమయంలోనే శరీర బరువులో 5 శాతానికి పైగా తగ్గడం అనేది సాధారణ విషయం కాదు. ఇది షుగర్, థైరాయిడ్ రుగ్మతలు లేదా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు తొలి సంకేతం కావచ్చు. కాబట్టి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

తగ్గని నిరంతర అలసట

రాత్రి వేళల్లో తగినంత నిద్రపోయిన తర్వాత కూడా పగటిపూట నిరంతర అలసట, నీరసం వేధిస్తుంటే శరీరంలో ఏదో లోపం ఉందని అర్థం. ఇది ముఖ్యంగా శరీరంలో రక్తహీనత లేదా విటమిన్ల లోపాలను సూచిస్తుంది. నిరంతర అలసట వల్ల రోజూవారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.

ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన తలనొప్పి

సాధారణంగా వచ్చే తలనొప్పులు వేరు, కానీ మెరుపులు మెరిసినట్లుగా అకస్మాత్తుగా తలపై సుత్తితో బాదినట్లు వచ్చే తీవ్రమైన తలనొప్పి చాలా ప్రమాదకరం. ఇది పక్షవాతం లేదా మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడానికి సంబంధించిన సమస్యల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుంది.

ఇతర అసాధారణ లక్షణాలు..

వీటితో పాటు శరీరంపై ఎంత కాలానికీ మానని పుండ్లు ఉండటం, అలాగే మలం లేదా మూత్రంలో రక్తం పడటం వంటి అసాధారణ మార్పులను గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ అన్నారు పెద్దలు. మన శరీరం పంపే ఇలాంటి అత్యవసర సంకేతాలను సకాలంలో గుర్తించి, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Follow Us