జుట్టు ఊడిపోవడం అంటే కేవలం షాంపూల వల్లే కాదు..! ఈ ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

జుట్టు రాలడం అనేది ఒక ఆరోగ్య సమస్య సంకేతం కావొచ్చు. సాధారణంగా స్వల్ప జుట్టు ఊడడం సహజమే అయినా.. ఎక్కువగా జుట్టు రాలుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీని వెనుక థైరాయిడ్, పీసీఓఎస్, విటమిన్ లోపం, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు దాగి ఉండవచ్చు.

జుట్టు ఊడిపోవడం అంటే కేవలం షాంపూల వల్లే కాదు..! ఈ ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!
Hair Fall

Updated on: Jun 29, 2025 | 9:28 PM

స్నానం చేసేటప్పుడు కొంత జుట్టు రాలడం సహజమే. అలాగే దిండు మీద కొన్ని వెంట్రుకలు ఉండటం కూడా సాధారణమే. కానీ రోజురోజుకీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుండటం, వెంట్రుకలు పల్చగా మారిపోవడం వంటి మార్పులు కనిపిస్తే.. దీని వెనుక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఈ సమస్యలను తేలిగ్గా తీసుకోకుండా అసలు కారణాలను గుర్తించాలి.

థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే జుట్టు తక్కువ సమయంలో రాలిపోతుంది. అలసటగా ఉండటం, బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా ఉంటే.. ఇది హైపోథైరాయిడిజం కావచ్చునని గమనించాలి.

స్త్రీలలో తరచూ కనిపించే హార్మోన్ల సమస్యలలో ఒకటి PCOS. ఇది అండాశయాల్లో చిన్న చిన్న గడ్డలుగా మారడం వల్ల నెలసరి గందరగోళాలు, ముఖంపై మొటిమలు, అధిక బరువు, జుట్టు రాలడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరానికి ఐరన్ తక్కువగా లభిస్తే.. రక్తహీనత ఏర్పడి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనిని నివారించాలంటే ఆకుకూరలు, పచ్చి బీన్స్, పచ్చిపప్పు, ఎర్ర మాంసం వంటి ఐరన్‌ తో నిండిన ఆహారాలు తీసుకోవాలి.

విటమిన్ డి లోపం వల్ల శరీరంలో అనేక రకాల ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిగా మారడం, పళ్లు బలహీనపడటం, జుట్టు ఊడిపోవడం మొదలైనవి. ఈ విటమిన్ సూర్యరశ్మి ద్వారా అందుతుంది కనుక ఉదయం కొన్ని నిమిషాలు వెలుతురులో గడపడం మంచిది.

లూపస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల రోగనిరోధక వ్యవస్థ స్వయంగా శరీర అవయవాలపై దాడి చేస్తుంది. దీని వల్ల చర్మంపై ఎరుపు మచ్చలు, కీళ్ల నొప్పులు, అలసట, జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే.. అది మీ జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీని వల్ల జుట్టు పలుచబడటం, జుట్టులో నూనె ఉత్పత్తిలో మార్పులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ జుట్టు సమస్యలతో పాటు మీకు తరచుగా మూత్రం రావడం, తలనొప్పి, అలసట వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే డయాబెటిస్ పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇది సకాలంలో సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవడానికి సహాయపడుతుంది.

ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా.. వీటి వెనుక ఉన్న అసలు కారణాలను నిర్ధారించాలంటే తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి.