
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే కీళ్ల నొప్పులు వస్తాయి. ముఖ్యంగా కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. దీనినే గౌట్ అని కూడా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కూడా యూరిక్ యాసిడ్ కారణం కావచ్చు. ఇది కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. గుండె జబ్బులు కూడా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెకు హాని చేస్తుంది. అందుకే యూరిక్ యాసిడ్‌ను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సార్డినెస్, రొయ్యలు, పీతలు లాంటి సీఫుడ్‌లో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి. కాబట్టి వీటిని తినకూడదు.
కూల్ డ్రింక్స్ లలో ప్యూరిన్‌లు తక్కువగా ఉన్నా.. వాటిలో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది.
పప్పులు ప్రోటీన్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారమే అయినా.. ప్రోటీన్ యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది. కాబట్టి పప్పులు కూడా తక్కువగా తినాలి.
యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే మద్యం తాగకూడదు. ఆల్కహాల్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆల్కహాల్ కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేయకుండా చేస్తుంది.
బచ్చలికూర, క్యాబేజీ, పుట్టగొడుగులు లాంటి కూరగాయలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు ఈ కూరగాయలు తక్కువగా తినాలి.
మాంసంలో యూరిక్ యాసిడ్‌ను పెంచే ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి.
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పైన చెప్పిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం వల్ల యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)