Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు ప్రాణం తీసే సమస్యగా మారింది. చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణాలు.. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, పొగ తాగడం, మద్యం తాగడం, ఎక్కువ ఒత్తిడి, షుగర్ జబ్బు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం లాంటివి.

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!
Heart Healthy

Updated on: Jun 25, 2025 | 2:06 PM

గుండెకు రక్తం అందించే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు.. గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీని వల్ల గుండె కండరాలు పాడవుతాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెపోటు ముందు తరచుగా ఛాతీలో బిగుతుగా, ఒత్తిడిగా లేదా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది కొన్ని క్షణాల పాటు ఉండి.. మళ్లీ రావచ్చు. ఇది ఎక్కువగా ఛాతీ మధ్యలో వస్తుంది.

ముఖ్యంగా ముఖం ఎడమ వైపు, దవడలో తీవ్రమైన నొప్పి రావడం గుండెపోటుకు ఒక సంకేతం కావచ్చు. ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు దీన్ని పంటి నొప్పి అనుకుని పట్టించుకోరు. గుండె నుంచి వచ్చే నొప్పి ఎడమ చేతికి పాకే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా చేతిలో తిమ్మిరి లేదా సత్తువ లేకపోవడం కూడా దీనికి ఒక సంకేతం కావచ్చు.

గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు నుంచే బాగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. రోజువారీ పనులు కూడా చేయలేకపోతే అది ఒక హెచ్చరికే. హార్ట్ అటాక్ వచ్చే సమయంలో శరీరం ఒక్కసారిగా చాలా ఎక్కువగా చెమట పడుతుంది. చాలా మంది దీన్ని వేడి వల్ల అనుకుని పట్టించుకోరు. ఆకలి లేకపోవడం, కడుపులో ఇబ్బంది, గ్యాస్ అనిపించడం లాంటివి కొన్నిసార్లు గుండెపోటు రాబోతుందని చెప్పే సంకేతాలు కావచ్చు.

తల తిరిగినట్లు అనిపించడం, కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం, ఒంట్లో నలతగా ఉండటం.. ఇవన్నీ గుండెపోటుకు సంబంధించిన మామూలు కాని లక్షణాలు. ఈ లక్షణాలు ఎక్కువగా ఆడవారిలో, వయసు పైబడినవారిలో, షుగర్ ఉన్నవారిలో, పొగ తాగే అలవాటు ఉన్నవారిలో, ఎక్కువ బరువు ఉన్నవారిలో కనిపిస్తాయి.

ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చెమటలు లాంటివి అనిపించిన వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి. 5 నిమిషాల్లోపు డాక్టర్ సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం పెరుగుతుంది.

గుండెపోటు ఒక్కసారిగా వచ్చే ప్రమాదకరమైన సంఘటన కాదు. ఇది కొన్ని రోజుల ముందు నుంచే కొన్ని హెచ్చరికల రూపంలో శరీరానికి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. మీరు మీ శరీరంలో ఏవైనా కొత్త లక్షణాలు చూస్తే వాటిని మామూలుగా భావించకుండా.. వెంటనే వైద్యుడిని కలవండి. మీ జీవితంలో సరైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.