ఖర్జూరాలు అంటే మీకు మహా ఇష్టమే.. అయితే ఈ విషయం పక్కా తెలుసుకోండి..

ఖర్జూరం కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. గడువు ముగిసిన ఖర్జూరంతో ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు. అఫ్లాటాక్సిన్‌లు, మైకోటాక్సిన్‌ల వంటివి క్యాన్సర్ కారకాలు కావచ్చు. సరైన నిల్వ పద్ధతులు, లేబుళ్లను సరిగ్గా చదవడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

ఖర్జూరాలు అంటే మీకు మహా ఇష్టమే.. అయితే ఈ విషయం పక్కా తెలుసుకోండి..
Dry Dates

Updated on: May 31, 2026 | 4:10 PM

ఖర్జూరం అనేకమందికి ప్రీతిపాత్రమైన ఆహారం. అయితే, దానిని కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీని తనిఖీ చేయాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన ఉండాలి. ఇటీవల గడువు ముగిసిన ఖర్జూరాలను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. దీంతో ఖర్జూరం ప్రియులలో కొంత ఆందోళన కలిగించింది. మరి గడువు ముగిసిన ఖర్జూరాన్ని ఎలా గుర్తించాలి? అలాంటి ఖర్జూరం తింటే కలిగే ప్రమాదాలేమిటి? ఖర్జూరం దిగుమతిపై వివరాలు పరిశీలిస్తే, వరల్డ్ బ్యాంక్ వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్ 2023 డేటా ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని దిగుమతి చేసుకునే దేశం భారత్. ఏటా 2000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఖర్జూరాన్ని భారత్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 45% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే వస్తుంది. ఇరాక్, ఇరాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఖర్జూరంలో ఉండే తీయదనం, డ్రైనెస్, తేమ వంటి లక్షణాల ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజిస్తారు.

ఖర్జూరాలను ఎంతకాలం సురక్షితంగా నిల్వ చేయవచ్చు లేదా తినవచ్చు అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎటువంటి నిర్దిష్ట సూచనలు చేయలేదు. అయితే, సాధారణంగా ఖర్జూరం స్వభావం, నిల్వ పద్ధతులను బట్టి ఆరు నెలల నుంచి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు నిల్వ చేసి తినవచ్చని అధికారులు చెబుతున్నారు. ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ కావడంతో, దిగుమతి అయినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు కాలాన్ని లెక్కించి, దాని ప్రకారం ప్యాకింగ్ తేదీ, ఎక్స్పైరీ తేదీని ప్యాకెట్లపై ముద్రిస్తారు. ఈ సమయం కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచితే, అవి సహజంగానే చెడిపోతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. అటువంటి ఖర్జూరంలో పురుగులు, ఇతర కీటకాలు పెరిగి, వాటిని తిన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఖర్జూరంలోని పోషకాల గురించి పోషకాహార నిపుణులు సైతం కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఖర్జూరంలో విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, చక్కెర వంటి పోషకాలు ఉంటాయి. అయితే, గడువు ముగిసిన ఖర్జూరంతో అనేక హానికరమైన ప్రమాదాలున్నాయి. ఖర్జూరాలు చెడిపోయినట్లు సాధారణంగా కంటికి కనిపించకపోవడమే ప్రధాన సమస్య. అధిక వేడి, అధిక తేమ ఉన్న ప్రదేశాలలో ఖర్జూరం వంటి అన్ని సహజ ఆహార పదార్థాలకు బూజు పడుతుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే అఫ్లాటాక్సిన్‌ను ఉత్పత్తి చేసే మైకోటాక్సిన్‌లను కలిగి ఉంటుంది, ఇది నేరుగా కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఫంగస్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ. ఎక్కువ బూజు పట్టిన ఖర్జూరం తిన్న కొందరికి వాంతులు, తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చని నిపుణులు తెలిపారు.

కొన్ని ఖర్జూరాలకు ముదురు నలుపు రంగు రావడానికి, అవి చెడిపోకుండా ఉంచడానికి సల్ఫేట్లను కలుపుతారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ సల్ఫేట్ విచ్ఛిన్నమైనప్పుడు, అది ఆస్తమా, అలర్జీలకు కారణం కావచ్చట. కాబట్టి, ప్యాకెట్లపై ఉండే లేబుళ్లను జాగ్రత్తగా గమనించి, గడువు తేదీని నిర్ధారించుకున్న తర్వాతే ఖర్జూరం కొనుగోలు చేయడం మంచిది. వినియోగదారులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us