
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుందని, దాహం తీరుతుందని, నీరసం దూరమవుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా, కొబ్బరి నీళ్లు హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయని, కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని, డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తాయని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ వాదనల్లో ఎంతవరకు నిజం ఉంది, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. ఆకుపచ్చగా ఉండే లేత కొబ్బరి కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయి. పండించే నేల, రకాన్ని బట్టి ఈ నీళ్ల రుచిలో స్వల్ప మార్పులు ఉంటాయి. అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్‌కు చెందిన పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్లలో 18 కేలరీలు, 0.2 గ్రాముల ప్రొటీన్, సున్నా ఫ్యాట్, 4.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.1 గ్రాముల చక్కెర, 165 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటాయి. నిపుణులు కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయని చెబుతారు. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కొబ్బరి నీళ్లలో ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొంది. గుండె ఆరోగ్యం, అస్థిపంజరం, కండరాల పనితీరుతో సహా శరీరానికి కీలకమైన ఈ ఖనిజాలను చాలా మంది సరిపడినంత పొందలేరని ఎన్ఐహెచ్ వెబ్‌సైట్ తెలిపింది. అయితే, పొటాషియం సమృద్ధిగా ఉండే, కొబ్బరి నీళ్ల కంటే చౌకగా దొరికే ఇతర ఆహార పదార్థాలు కూడా చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎల్-ఆర్జినిన్ అనే అమైనో ఆమ్లం ప్రోటీన్ల తయారీకి సహాయపడుతుందని ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ పేర్కొంది. కొబ్బరి నీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. డయాబెటిస్ ఉన్న ఎలుకలపై చేసిన పరిశోధనలో, కొబ్బరి నీళ్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచి, గ్లైకోహిమోగ్లోబిన్‌ను తగ్గించాయని ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. జంతువులపై చేసిన పరిశోధనల ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయని, డయాబెటిస్‌తో సంబంధమున్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే హానికారక ప్రభావాలను తగ్గిస్తాయని ఎన్ఐహెచ్ తెలిపింది.
కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అయితే అవకాడో, అరటిపండ్లలో కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. జంతువులపై ఆశాజనకమైన ఫలితాలు కనిపించినప్పటికీ, మానవులలో ఈ ప్రభావాల గురించి స్పష్టమైన అంచనాకు రావడానికి మరింత పరిశోధన అవసరమని నిపుణులు పేర్కొన్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడినంత ద్రవాహారాన్ని అందించాలి. కాల్షియం, ఆక్సలేట్ వంటి సమ్మేళనాలు కలిసిపోయి గట్టి స్పటికాలుగా మారినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా, అవి కిడ్నీలకు, మూత్రనాళాలకు అంటుకోకుండా ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అథ్లెట్ల పనితీరు, సామర్థ్యం పెరుగుతాయని చెబుతారు. ఇందులో సోడియం, పొటాషియంతో పాటు గ్లూకోజ్ రూపంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగితే అధిక వేడి వాతావరణంలోనూ వ్యాయామం చేయగల సామర్థ్యం మెరుగుపడుతుందని ఒక అధ్యయనం సూచించింది. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే కార్బోహైడ్రేట్, ఎలక్ట్రోలైట్ స్పోర్ట్స్ డ్రింక్ తరహాలోనే శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుందని మరో అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్ తీసుకున్నాక వచ్చే హ్యాంగోవర్ డీహైడ్రేషన్, రక్తంలోని టాక్సిన్ల వల్ల కలుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తలనొప్పిని తగ్గించడంలో పొటాషియం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ కాలేయానికి టాక్సిన్లను బయటికి పంపడంలో సహాయపడతాయి. మాంగనీస్‌లో యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయని, హ్యాంగోవర్ లక్షణాల చికిత్సలో ఇది ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత లోపించినప్పుడు కలిగే తలనొప్పి, నీరసం, వికారం వంటి లక్షణాల నుంచి కొబ్బరి నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి.
అయితే, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హ్యాంగోవర్ లక్షణాలు తక్షణమే నయం కావని, కానీ శరీరం వెంటనే హైడ్రేట్ కావడం వల్ల శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. హ్యాంగోవర్ దిగిపోతుందని చెప్పడానికి సరిపడినంత శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ, ఎలక్ట్రోలైట్ల కారణంగా రీహైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్లను ఒక మార్గంగా ఎంచుకుంటారు. చాలా మందికి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవని నిపుణులు తెలిపారు. అయితే, మూత్రపిండాలు సరిగా పనిచేయనివారు, పొటాషియం పరిమితంగా తీసుకోవాల్సినవారు హైడ్రేషన్ కోసం తరచుగా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు. ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ కండిషన్‌లో ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.