బొడ్డులో ఆముదం వేస్తే రోగాలు మాయమవుతాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బెల్లీ ప్యాచ్’

ఆయుర్వేదం ప్రకారం బొడ్డు ప్రాంతం శరీరంలోని కీలక నాడులకు కేంద్ర బిందువు. ఇక్కడ నూనె రాయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రాచీన కాలం నుండి నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇదే పద్ధతి 'బెల్లీ ప్యాచ్' రూపంలో కొత్తగా ట్రెండ్ అవుతోంది.

బొడ్డులో ఆముదం వేస్తే రోగాలు మాయమవుతాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బెల్లీ ప్యాచ్’
Castor Oil Belly Patch.jpg

Updated on: Mar 22, 2026 | 10:51 AM

నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల హెల్త్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. అందులో ఒకటి ‘ఆముదం బెల్లీ ప్యాచ్’. బొడ్డులో ఆముదం వేయడం వల్ల బరువు తగ్గుతారని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, శరీరం డీటాక్స్ అవుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఆయుర్వేద చిట్కా వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? దీనివల్ల నిజంగా లాభాలు ఉన్నాయా లేదా కేవలం ఇదొక భ్రమనా? నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

ఎలా అప్లై చేస్తారు?

సాధారణంగా రెండు పద్ధతుల్లో దీనిని అనుసరిస్తారు.

  1. బెల్లీ ప్యాచ్- ఆముదంలో తడిపిన దూదిని లేదా గుడ్డను బొడ్డుపై ఉంచి, దానిపై టేప్ వేసి రాత్రంతా ఉంచుతారు.
  2.  డైరెక్ట్ మసాజ్- నిద్రపోయే ముందు రెండు మూడు చుక్కల ఆముదాన్ని బొడ్డులో వేసి సున్నితంగా మసాజ్ చేస్తారు.

ఆముదానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఈ పద్ధతి ద్వారా ఈ కింద పేర్కొన్న ప్రయోజనాలు కలగవచ్చని కొందరు నమ్ముతారు. మలబద్ధకం నుండి ఉపశమనం మరియు జీర్ణక్రియ మెరుగుపడటం. కడుపు ఉబ్బరం తగ్గడం. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం. శరీరంలోని మలినాలను తొలగించడం.

నిపుణులు ఏమంటున్నారు?

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతి వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. మన చర్మం బయటి పదార్థాలు లోపలి అవయవాల్లోకి చొచ్చుకుపోకుండా నిరోధించేలా నిర్మించబడింది. కాబట్టి బొడ్డుపై నూనె రాయడం వల్ల అది నేరుగా పేగులపై లేదా హార్మోన్లపై ప్రభావం చూపుతుందనడం కష్టమని వైద్యులు అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఉపశమనం కలిగితే, అది నూనె వల్ల కంటే.. మసాజ్ చేయడం వల్ల కలిగే వెచ్చదనం మరియు రక్త ప్రసరణ పెరగడం వల్లేనని వారు వివరిస్తున్నారు.

దుష్ప్రభావాలు..

ఆముదం అందరికీ పడకపోవచ్చు. రాత్రంతా దీనిని చర్మంపై ఉంచడం వల్ల.. చర్మం ఎర్రబారడం లేదా దురద రావచ్చు. చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు రావచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, సున్నితమైన చర్మం ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా దీనిని ప్రయత్నించకూడదు. ఆముదం బెల్లీ ప్యాచ్ అనేది ఒక సహాయక చర్య మాత్రమే తప్ప, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదు. మీకు తరచుగా జీర్ణ సమస్యలు ఉంటే కేవలం ఇలాంటి చిట్కాలపై ఆధారపడకుండా.. సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సలహాలు పాటించడం శ్రేయస్కరం.

Follow Us