20 ఏళ్లకే క్యాన్సర్.. యువతలోనే ఎక్కువగా ఎందుకు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ పెద్దలకే కాదు.. చిన్న వయసు వాళ్లలో కూడా దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నేటి యువత ముఖ్యంగా 20 ఏళ్ల వాళ్లు, టీనేజర్లు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వాళ్ళలో క్యాన్సర్ కేసులు పెరిగాయి.

20 ఏళ్లకే క్యాన్సర్.. యువతలోనే ఎక్కువగా ఎందుకు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Cancer

Updated on: Jul 31, 2025 | 10:13 PM

క్యాన్సర్ పెరగడానికి ముఖ్య కారణాలు అనారోగ్యకరమైన జీవనశైలి, ఎక్కువ ఒత్తిడి, పొగాకు వాడకం, చెడు రసాయనాల ప్రభావమే అని నిపుణులు అంటున్నారు. వంశపారంపర్యత ఒక కారణం అయినా.. కేవలం 5 శాతం నుంచి 10 శాతం క్యాన్సర్ కేసులు మాత్రమే వారసత్వం వల్ల వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మిగతా 90 శాతం పైన జీవనశైలి, ఆహారం, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, జబ్బుల వల్ల వస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ వల్ల జరిగే మరణాల్లో 30 నుంచి 35 శాతం ఆహారం వల్లే. పొగాకు వల్ల 30 శాతం. అలాగే ఎక్కువ కాలం ఉండే ఇన్ఫెక్షన్లు, సూక్ష్మజీవుల వల్ల 15 నుంచి 20 శాతం కారణాలు ఉంటున్నాయి.

క్యాన్సర్‌ కు దారి తీసే ముఖ్యమైన కారణాలు

  • ఎక్కువగా ప్రాసెస్ చేసిన లేదా పొగబెట్టిన ఆహారం తినడం
  • ఎక్కువ చక్కెర వాడకం
  • ఎప్పుడూ ఒత్తిడి లేదా మానసిక ఆందోళన
  • హానికరం అయిన పురుగుమందుల వాడకం
  • కాలుష్యం ఉన్న వాతావరణం
  • కొన్ని వైరల్ లేదా ఫంగస్ వల్ల వచ్చే జబ్బులు

క్యాన్సర్‌ ను ఆపే ఆరోగ్యకరమైన అలవాట్లు

  • పోషకాలు నిండిన ఆహారం తినడం.. బెర్రీలు, ఆకుకూరలు, అవకాడో, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు లాంటివి శరీరంలో వాపును తగ్గిస్తాయి. క్యాన్సర్‌ను ఎదుర్కొంటాయి.
  • రోజూ వ్యాయామం చేయడం.. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల కొలెస్ట్రాల్, ఇన్సులిన్ స్థాయిలు తగ్గించవచ్చు.
  • సూర్యకాంతిని పొందడం.. ఉదయం తక్కువ సూర్యరశ్మిని తీసుకోవడం వల్ల విటమిన్ D అందుతుంది. ఇది క్యాన్సర్ రాకుండా సాయపడుతుంది.
  • మంచి నిద్ర.. ప్రతి రోజు సరిపడా నిద్రపోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది.
  • కాలుష్యానికి తగిన జాగ్రత్తలు.. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు.. బయటికి వెళ్ళేటప్పుడు మంచి మాస్క్ వేసుకోవడం ద్వారా ఊపిరితిత్తులపై ప్రభావాన్ని తగ్గించవచ్చు.
  • మూలికలు వాడడం.. తులసి, అల్లం, పసుపు, అలోవెరా లాంటి ఆయుర్వేద మూలికలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • ఒత్తిడిని అదుపు చేయడం.. ధ్యానం, ప్రాణాయామం, సంగీతం వినడం లాంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా కూడా మేలు చేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో యువత ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ కు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా.. రోగనిరోధక శక్తిని బలంగా చేసి ప్రమాదాలను తగ్గించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)