జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? జీడిపప్పు ఎలా తినాలి..?

జీడిపప్పులో ఉన్న పోషకాలు శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే దీన్ని తింటే బరువు పెరగుతుందా లేక తగ్గుతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే, మోతాదు, తినే సమయం, శారీరక శ్రమ వంటి అంశాలు కీలకం.

జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? జీడిపప్పు ఎలా తినాలి..?
Cashew Nuts Health Benefits

Updated on: Apr 22, 2025 | 2:51 PM

జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి. అయితే చాలా మందిలో జీడిపప్పు తింటే బరువు పెరుగుతామా.. లేక తగ్గుతామా అనే సందేహం ఉంటుంది. అయితే దీనికి సమాధానం కొంతవరకు మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

జీడిపప్పులో ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే మంచి స్నాక్‌లలో ఒకటి. కేవలం శక్తి మాత్రమే కాదు.. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. వీటి వలన శరీరానికి కావాల్సిన పోషణ పూర్తవుతుంది.

బరువు పెరగాలనుకునే వారు సాధారణంగా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి వారికోసం జీడిపప్పు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా వేయించిన జీడిపప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటే రుచిగా ఉంటుంది, అందులోని కేలరీలు శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే విధంగా పని చేస్తాయి. ఈ విధంగా తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.

అయితే జీడిపప్పులోని ఫైబర్ శరీరానికి మరొక విధంగా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువ సేపు ఆకలిని దూరం చేస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో తినే ఆహారపు మొత్తాన్ని నియంత్రించవచ్చు. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారు కూడా జీడిపప్పును మితంగా తీసుకుంటే ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో మితంగా జీడిపప్పును చేర్చుకోవచ్చు. ఉదాహరణకు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ తేలికపాటి అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి తగిన శక్తి అందుతుంది. అంతేకాదు అనవసరంగా జంక్ ఫుడ్ తినే అలవాటును కూడా తగ్గించవచ్చు. అయితే ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి.. జీడిపప్పును మితంగా తీసుకున్నప్పుడే ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

ఇక జీడిపప్పును తినే విధానం కూడా చాలా ముఖ్యం. నేరుగా తినడం కన్నా వేయించి లేదా ఉప్పు కలిపి తినడం వల్ల అదనపు కేలరీలు చేరతాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది మేలు చేస్తుంది. అదే బరువు తగ్గాలనుకునేవారు అయితే ఉప్పు లేకుండా వేయించకుండా మితంగా తినడం ఉత్తమం. రోజువారీ డైట్‌లో 4-5 జీడిపప్పులు తినడం శరీరానికి అవసరమైన కొవ్వులను అందిస్తుంది. కానీ రోజులో 10-15 దాటి తీసుకుంటే అధిక కేలరీలు చేరే అవకాశం ఉంది.

జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతామా.. లేక తగ్గుతామా అన్నది పూర్తిగా మనం తీసుకునే మోతాదు, తినే సమయం, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేయకుండానే అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది. అదే విధంగా రోజూ వ్యాయామం చేస్తూ మితంగా తీసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)