
నోటి దుర్వాసన, చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే ఒక సమస్య, తరచుగా దీనిని బాధితులు స్వయంగా గుర్తించలేరు. పది మందిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుందని అంచనా. ఈ సమస్య సామాజిక సంబంధాలపై ప్రభావం చూపగలదు. మన నోటికి మన ముక్కు ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పటికీ, మన నోటిలోని వాసన మనకే తెలియదు. కానీ ఇతరులు సులభంగా గమనించగలరు. ఈ సమస్యకు మూల కారణాలను అర్థం చేసుకోవడం, సరైన పరిష్కారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం: చాలా మంది, వయసుతో సంబంధం లేకుండా, బ్రషింగ్ టెక్నిక్‌ను సరిగ్గా పాటించరు. బ్రషింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల నోటిలో ఆహార కణాలు పేరుకుపోయి, బ్యాక్టీరియా వృద్ధి చెంది దుర్వాసనకు కారణమవుతుంది.
పళ్లలో పురుగులు(దంత క్షయం): పళ్లలో పురుగులు లేదా దంత క్షయం ఉన్నప్పుడు, ఆ ఖాళీలలో ఆహారం ఇరుక్కుని, బ్యాక్టీరియా చర్య వల్ల దుర్వాసన వస్తుంది. ఇది నోటి పరిశుభ్రత లోపానికి ఒక కారణం.
చిగుళ్ల వ్యాధులు: బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల చిగుళ్ల వ్యాధులు(జింజివైటిస్, పీరియడోంటైటిస్) రావొచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా చిగుళ్ల వ్యాధులు తరచుగా కనిపిస్తాయి, ఇవి నోటి దుర్వాసనకు దారితీస్తాయి.
నాలుకను శుభ్రం చేయకపోవడం: చాలామంది తమ నాలుకను శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నాలుకపై బ్యాక్టీరియా, ఆహార అవశేషాలు పేరుకుపోయి దుర్వాసనకు ప్రధాన కారణమవుతాయి. నాలుక క్లీనర్ ఉపయోగించడం అవసరం.
నీరు తక్కువ తాగడం: తగినంత నీరు తాగకపోవడం వల్ల నోరు పొడిబారి లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. లాలాజలం నోటిని శుభ్రం చేయడంలో, బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నోరు పొడిబారడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది దుర్వాసన వస్తుంది.
గ్యాస్ట్రైటిస్/జీర్ణ సమస్యలు: గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ లేదా జీర్ణ సంబంధిత రుగ్మతలు ఉన్నప్పుడు కడుపు నుంచి వచ్చే వాయువులు నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.
చెవి, ముక్కు, గొంతు సమస్యలు: సైనసైటిస్, టాన్సిల్స్ లేదా గొంతు ఇన్ఫెక్షన్లు వంటి చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు కూడా నోటి దుర్వాసనకు దారితీయవచ్చు.
నియంత్రణలో లేని మధుమేహం: నియంత్రణలో లేని మధుమేహం ఉన్నవారిలో నోటి దుర్వాసన ఒక సాధారణ సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కేటోసిస్ అనే పరిస్థితి ఏర్పడి, శ్వాసలో ప్రత్యేకమైన వాసన వస్తుంది.
కొన్ని మందులు: కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు నోటి దుర్వాసనకు కారణం కావచ్చు, ఎందుకంటే అవి నోరు పొడిబారడానికి దారితీయవచ్చు.
నోటి దుర్వాసనను పరిష్కరించడానికి కేవలం టూత్‌పేస్ట్‌లు, మౌత్‌వాష్‌లు లేదా నోటి స్ప్రేలు వంటి తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడటం సరికాదు. ఈ ఉత్పత్తులు కేవలం దుర్వాసనను తాత్కాలికంగా మాస్క్ చేస్తాయి కానీ మూల కారణాన్ని తొలగించవు. శాశ్వత పరిష్కారం కోసం, నోటి దుర్వాసనకు అసలు కారణాన్ని కనుగొనడం అత్యవసరం. దంత వైద్యుడిని సంప్రదించి ఫుల్‌గా డెంటల్ చెకప్ చేయించుకోవడం ద్వారా, నిర్దిష్ట కారణాన్ని గుర్తించి, దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు.