Back Pain: ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటాడు. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సరైన చికిత్స తీసకుంటే మంచిది. లేదంటే చాలా తీవ్రతరం అవుతుంది. నేటి కాలంలో యువత ప్రతిరోజూ 10 నుంచి 12 గంటల పాటు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నారు. దీని కారణంగా వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. దాదాపు 25 నుంచి 26 సంవత్సరాల యువత వెన్నునొప్పిబారిన ఎక్కువగా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యపై అవగాహన అవసరం. లేదంటే ఇది మిమ్మల్ని ఏళ్ల తరబడి మంచంపై పడుకోబెడుతుంది. నడుము నొప్పికి సంబంధించిన 90% కేసులలో శస్త్రచికిత్స అవసరం లేదు. సరైన ఆహారం, వ్యాయామాలతో వెన్నునొప్పిని నియంత్రించవచ్చు. తక్కువ వెన్నునొప్పికి డిస్క్ ఎల్లప్పుడూ బాధ్యత వహించదు. కానీ చాలా మంది రోగులలో వెన్నెముక కీళ్లలో సమస్యల కారణంగా నొప్పి పెరుగుతుంటుంది. ఈ నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే రోగుల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు మొదలై ఆత్మహత్య దిశగా పయనిస్తారు.
ఒకే చోట కూర్చొని పని చేసే వృత్తితో అనుబంధం ఉన్నవారు నడుంనొప్పి బారిన ఎక్కువగా పడుతారు. మసాజ్ చేయడం అనేది ఈ సమస్యకి పరిష్కారం కాదు. కేవలం దీనివల్ల ఉపశమనం మాత్రమే దొరుకుతుంది. నడుంనొప్పికి ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. వాస్తవానికి వైద్యులు కొన్ని రకాల కేసులలో మాత్రమే శస్త్రచికిత్సను సూచిస్తారు. మీరు రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు నడుంనొప్పితో బాధపడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకవారం పాటు నొప్పి ఇలాగే కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకొని మందులు వాడాల్సి ఉంటుంది. మొదట్లో అయితే నొప్పి తొందరగా తగ్గుతుంది. ముదిరితే చాలా రోజులు పడుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.