51 Villagers Test Covid-19 Positive : తెలంగాణలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. గత సంవత్సరం మొత్తం లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడిన జనాలు మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకు గ్రామాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ భయందోళనలు మొదలయ్యాయి.. మరోవైపు నిపుణులు మొదట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో మళ్లీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒకే గ్రామానికి చెందిన 51 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వేములవాడ గ్రామీణ మండలం జయవరంలో 180 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 51 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. కరోనా సోకిన వారందరిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అందరూ మాస్కుల ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో గల చిత్ర లేఅవుట్‌లోని అనాథాశ్రమంలో 45 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థులు పలువురు జ్వరం సహా కోవిడ్ లక్షణాలతో బాధపడుతుండగా.. అనాథాశ్రమం నిర్వాహకులు వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 45 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను లేఅవుట్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గల గదుల్లో ఐసోలేషన్‌కు పంపించారు. కాగా, ఈ అనాథాశ్రమంలో సుమారు వంద మంది పిల్లలు నివసిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మిగతా వారికి కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు తెలిపారు. వీరికి సంబంధించిన ఫలితాలు వెల్లడించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.
ఇదిలాఉండగా.. నిజామాబాద్ జిల్లాలో 86 మంది కరోనా బారిన పడ్డారు. ఓ వివాహ వేడుకకు హాజరైన వీరికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వివాహ వేడుకలో సుమారు 320 మంది పాల్గొనగా.. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కల్పించాయి. దాంతో వారు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్యులు వారిని కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. దాంతో ఆ వివాహ వేడుకలో పాల్గొన్న వారందరికీ కరోనా టెస్ట్ చేయగా.. 86 మందికి పాజిటీవ్ తేలింది. ఇక జగిత్యాల జిల్లాలోనూ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.