
తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ ‘మక్కల్ సెల్వన్’ ఇప్పుడు ఒక సాహసోపేతమైన అడుగు వేశారు. సాధారణంగా ఈ రోజుల్లో కమర్షియల్ హంగులు, భారీ డైలాగులు లేని సినిమాను ఊహించడం కష్టం. కానీ ఆయన మాత్రం మాటలు లేని ఒక మూకీ సినిమాతో పలకరించబోతున్నారు. కేవలం హావభావాలతోనే కథను నడిపిస్తూ, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన డైరెక్టర్లకు, నటీనటులకు ఇచ్చిన ఒక సూచన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ టాలెంటెడ్ నటుడు ఎవరు? ఆయన నటించిన ఆ విభిన్నమైన సినిమా సంగతులేంటో తెలుసుకుందాం..
విజయ్ సేతుపతి ప్రస్తుతం అరవింద్ స్వామితో కలిసి ‘గాంధీ టాక్స్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం ఎమోషన్స్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఈ ఇద్దరు దిగ్గజ నటులు సిద్ధమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ రోజుల్లో సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ సినిమా సహజంగా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా అంటేనే వినోదం అని, ఫిల్మ్ మేకర్స్ ప్రేక్షకులకు అర్థం కాని విధంగా సినిమాలు తీయకూడదని విజయ్ సేతుపతి సూచించారు. “ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని ఖర్చు చేసి థియేటర్లకు వస్తారు. వారికి వినోదాన్ని అందించడం మన బాధ్యత. ప్రయోగాలకు స్వాగతం చెప్పాలి కానీ, అది ప్రేక్షకులకు భారం కాకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. ‘గాంధీ టాక్స్’ ఏదో అద్భుతం అని తాను చెప్పడం లేదని, కానీ ఒక సరికొత్త సినిమా చూసిన అనుభూతిని మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Gandhi Talks Poster
సాధారణంగా రెగ్యులర్ ఫార్మాట్ లో లేని సినిమాల పట్ల చిత్ర యూనిట్ లో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ‘గాంధీ టాక్స్’ టీమ్ కూడా మొదట అలాగే ఫీల్ అయ్యారట. అయితే సినిమా పూర్తి అయ్యాక కొంతమంది సన్నిహితులకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారని, వారి నుంచి వచ్చిన పాజిటివ్ స్పందన చూశాక సినిమాపై నమ్మకం పెరిగిందని విజయ్ సేతుపతి తెలిపారు. అయితే స్నేహితులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ సినిమా మార్కెట్ కు ఏమాత్రం ఉపయోగపడదని ఆయన చమత్కరించారు. మొదట్లో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం విజయ్ సేతుపతి నైజం. ఆయన నటనలో ఉండే సహజత్వమే ఆయనను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఇప్పుడు అరవింద్ స్వామి లాంటి మరో టాలెంటెడ్ నటుడితో కలిసి ఆయన చేస్తున్న ఈ ప్రయోగం ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాటలు లేకపోయినా, ఈ ఇద్దరు నటుల కళ్ళే కథను చెబుతాయని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ మూకీ సినిమాకు ప్రాణం పోయనుంది. సినిమా రంగంలో మార్పులు వస్తున్న తరుణంలో విజయ్ సేతుపతి లాంటి వారు ఇలాంటి ప్రయోగాలు చేయడం నిజంగా అభినందనీయం. ‘గాంధీ టాక్స్’ కేవలం ఒక నిశ్శబ్ద చిత్రం మాత్రమే కాదు, అది ఒక మౌన విప్లవం అని చెప్పాలి.