Lawrence Bishnoi: లారెన్స్‌ బిష్ణోయ్‌, హీరో సల్మాన్ ఖాన్ మధ్య ఇంతటి వైరం ఎలా పుట్టింది..?

|

Oct 19, 2024 | 8:53 AM

అతడు.. ఇతడు.. మధ్యలో ఒక మూగజీవం. తను చచ్చి వీళ్లిద్దరి మధ్య మంట రాజేసి చంపుకునేదాకా వెళ్లింది ఆ మూగజీవం. కృష్ణజింక... ఎస్ ఆ కథకు అదేనట అసలు పేరు! నొటోరియస్ గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ అసలు టార్గెట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖానేనని దేశమంతా చెప్పుకుంటోంది. వీళ్లిద్దరి మధ్య ఇంతటి వైరం ఎలా పుట్టింది.. ఎప్పటి నుంచి ముదిరింది.. ఏవిధంగా ముగింపుకొస్తుంది..?

Lawrence Bishnoi: లారెన్స్‌ బిష్ణోయ్‌, హీరో సల్మాన్ ఖాన్ మధ్య ఇంతటి వైరం ఎలా పుట్టింది..?
Lawrence Bishnoi Vs Salman Khan
Follow us on

నైన్‌టీన్ ఎయిటీస్‌లో మన చుట్టూ తిరిగిన ఆ మైనే ప్యార్ కియా కుర్రాడు.. హమ్‌ ఆప్‌ కే హై కౌన్ అంటూ నార్తూ సౌతూ తేడా లేకుండా కోట్లాది ఫ్యామిలీల్లో ఒకడిగా కలిసిపోయినవాడు.. తర్వాత కింగ్‌సైజ్ హీరోగా ఎదిగి.. లెక్కలేనంత స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్న తిరుగులేని కథానాయకుడు.. ఇప్పుడు.. చావు భయాన్ని కంట్లో పెట్టుకుని.. క్షణమొక యుగంలా గడపాల్సిన పరిస్థితి నెలకుంది.  సల్మాన్‌ హీరోయిజం ఈ గతి పట్టడానికి అసలు కారకుడు లారెన్స్ బిష్ణోయ్. అతడి పేరు తలచుకుంటేనే ఇతడికి చెమటలు పట్టేస్తున్నాయి. ఎవరు హీరో.. ఎవరు విలనో తెలీనంత ఇంట్రస్టింగ్‌గా మారిన ఈ కథలో మరో క్యారెక్టర్ పేరు కృష్ణజింక.. ది బ్లాక్‌బక్.

1998లో హమ్‌సాత్‌ సాత్‌హై సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్‌ వెళ్లిన సల్మాన్‌ఖాన్.. షాట్‌ గ్యాప్‌లో తుపాకీ తీసుకుని అడవుల్లో వేటకెళ్లినట్టు.. అక్కడ ఒక కృష్ణజింకను చంపి తెచ్చుకున్నట్టు అప్పట్లో బైటికొచ్చిన ఒక సంచలన వార్త. ఈ కృష్ణజింకే సల్మాన్‌ఖాన్ ప్రాణాల మీదకు తెచ్చిందా..? రెండున్నర దశాబ్దాల నుంచీ అతడి కెరీర్‌ని నాశనం చేస్తోందా? అనే చర్చే ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. ఈ కృష్ణజింక మిస్టరీ తేలాలంటే 500 ఏళ్ల నాటి ఫ్లాష్‌బ్యాక్‌ చూడాల్సిందే. 15వ శతాబ్దంలో రాజస్థాన్‌కి చెందిన జంబేశ్వర్ అనే వైష్ణవ భక్తుడు విష్ణోయ్ పంత్ అనే కొత్త థియరీతో ఒక సమాజానికి ఊపిరిపోశాడు. జంతువుల్ని ప్రేమించాలి, మాంసాహారం తినకూడదు, నిజాయితీగా బతకాలి.. అనే ఆయన బోధనల్ని దాదాపు 6 లక్షల మంది బిష్ణోయ్‌లు ఇష్టంగా పాటిస్తారు. ఆ తెగలో ఒకడు.. 31 ఏళ్ల యువకుడు లారెన్స్ బిష్ణోయ్.

బిష్ణోయ్‌ల సంప్రదాయాల ప్రకారం జంతువధ పెద్ద నేరం. ముఖ్యంగా వీళ్లు కృష్ణజింకను దేవతగా పూజిస్తారు. ఎవరైనా వీటి జోలికొస్తే చంపుతారు లేదా చస్తారు. అటువంటి పవిత్రమైన కృష్ణజింకను వేటాడి చంపి తిన్న సల్మాన్‌ఖాన్‌ తమకు శత్రువేనంటూ బహిరంగంగా ప్రకటించుకుంది బిష్ణోయ్ తెగ. 1998.. అక్టోబర్ 2న సల్మాన్‌ఖాన్ మీద కేసు నమోదైంది. విడతల వారీగా 20 రోజుల పాటు జైల్లో గడిపారు సల్మాన్‌. కానీ.. కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆధారాల్లేవు అంటూ రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో మళ్లీ కేసు పెండింగ్‌లో పడింది. 26 ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటం ఫలించకపోవడంతో బిష్ణోయ్ తెగలో సహనం చచ్చిపోయిందట.

సల్మాన్‌ఖాన్‌కి మనమే మరణశిక్ష వేద్దామనేంత కసి వాళ్లలో పెరిగింది. అదే తెగలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఇదే లక్ష్యంతో ఎదిగి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. 700 మంది యువకుల్ని చేరదీసి.. ఐదారు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ విస్తరించుకుని.. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖి హత్యతో.. తానేంటి.. తన లక్ష్యమేంటి అనేది ప్రపంచానికి గ్రాండ్‌గా పరిచయం చేసుకున్నాడు. సల్మాన్-కృష్ణజింక కేసు మొదలయ్యే నాటికి ఐదేళ్లున్న బిష్ణోయ్ వయసు ఇప్పుడు 31 ఏళ్లు. నరనరాల్లో సల్మాన్‌ మీద ప్రతీకారాన్ని పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్.. తన అల్టిమేట్ టార్గెట్ సల్మాన్‌ఖానే అని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పుకున్నాడు.

తన తమ్ముడిలాంటి వాడు అంటూ సల్మాన్ ఖాన్ చెప్పడం వల్ల గిప్పీ గ్రేవాల్‌ మీద, సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ఫోటో తీసుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో థిల్లాన్ అనే సింగర్‌ మీద హత్యాయత్నం జరిగింది. సల్మాన్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నాడన్న కారణంతో ఇప్పుడు మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని స్పాట్‌ పెట్టి లేపేశారు. వీటన్నిటి వెనకా ఉన్నది నన్ అదర్‌దేన్ లారెన్స్ బిష్ణోయ్ అని గట్టిగా నమ్ముతోంది ముంబై పోలీస్. కేవలం సల్మాన్‌ఖానే టార్గెట్‌గా ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన లారెన్స్ బిష్ణోయ్.. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. అక్కడినుంచే గ్యాంగ్‌ని ఆపరేట్ చేస్తున్నాడు.

Also Read: “అసలు బాలయ్యతో గొడవేంటి”.. తన మనసులోని మాట బయటకు చెప్పేసిన ఎన్టీఆర్

పెళ్లి కూడా చేసుకోకుండా.. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా, జీవితమంతా సినిమాలకే ఖర్చుపెడ్తున్న అపర త్యాగమూర్తి సల్లూ భయ్యా.. ఇప్పుడు ప్రాణాల్ని అరచేత పెట్టుకుని.. బతకాల్సిన పరిస్థితి. కానీ.. బేఫికర్ మీ ప్రాణాలు భద్రంగా ఉండాలంటే పాప పరిహారం చేసుకో.. అంటూ ప్లాన్ బీని కూడా సల్మాన్‌ ముందుంచింది బిష్ణోయ్ తెగ. బిష్ణోయ్ ఆలయానికి వెళ్లి.. తప్పయిపోయిందని లెంపలేసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలట. అలా చేస్తే సల్మాన్ జోలికి రానేరాం.. అని మాటిచ్చాడు లారెన్స్ బిష్ణోయ్. మరి.. చావు భయం నుంచి విముక్తి పొందడానికి సల్మాన్ సారీ చెబుతారా..? ఒకవేళ అదే చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్టవుతుంది.. కోర్టులు ఊరికే ఉండవు.. మళ్లీ బోనెక్కాల్సి వస్తుంది. సో.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది సల్మాన్ పరిస్థితి.

టోటల్‌గా ‘లారెన్స్ బిష్ణోయ్ అండ్ సల్మాన్‌ ఖాన్‌’.. మాంచి మల్టిస్టారర్‌ సినిమాను తలపిస్తోంది. ఇంత స్టఫ్ఫున్న కహానీ నేనెప్పుడూ చూడ్లే అని రామ్‌గోపాల్ వర్మే నోరెళ్ల బెట్టేశారు. బాలీవుడ్ స్టార్లనే కాదు.. గ్యాంగ్‌స్టర్ల జీవితాల్ని కూడా దగ్గరినుంచి చూసి, వాటిని వడబోసి వేడివేడిగా తెరకెక్కించి సక్సెస్ కొట్టిన వర్మ.. వీళ్లిద్దరిలో ఎవరు హీరో.. ఎవరు విలన్ మీరే చెప్పండి.. అని జనానికి ఓ ఫజిల్ కూడా వదిలాడు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.