వందల ఎకరాల ఆస్తి నుంచి.. చివరకు అత్యంత దుర్భర పరిస్థితుల్లో

నటి పవలా శ్యామల జీవిత ప్రయాణం వందల ఎకరాల ఆస్తి నుండి నేటి ఆర్థిక కష్టాల వరకు సాగింది. నాటకాలు, సినిమాలు చేసినా, ఉత్తమ నటిగా అవార్డులు పొందినా, ఆత్మాభిమానంతో జీవించాలనుకున్న ఆమెకు కష్టాలు తప్పలేదు. కూతురి కోసం జీవనం సాగించిన ఆమె, అవకాశాల కోసం ఎదురుచూస్తూ, సినీ రంగంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. చివరికి అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడారు.

వందల ఎకరాల ఆస్తి నుంచి.. చివరకు అత్యంత దుర్భర పరిస్థితుల్లో
Pavala Shyamala

Updated on: Jul 31, 2026 | 3:23 PM

నటి పవలా శ్యామల సినీ, నాటక రంగ ప్రస్థానం అపారమైన అనుభవం, ఆత్మాభిమానం, అదే స్థాయిలో కష్టాలతో నిండి ఉంది. ఒకప్పుడు వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చివరికి అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడారు. తన తండ్రికి వందల ఎకరాల ఆస్తి ఉండేదని, అవన్నీ కోల్పోయిన తర్వాత తన జీవితం కష్టాలమయం అయ్యిందని పవలా శ్యామల వెల్లడించారు. నాటక రంగంలో ఆమె చేసిన సేవ అపారమైనది. 2500 సార్లు ఉత్తమ నటి అవార్డులు అందుకున్న ఆమె, దాదాపు 150 సినిమాల్లో కూడా నటించారు. అయితే, ఈ గౌరవం, గుర్తింపు ఆర్థికంగా ఆమెకు పెద్దగా తోడ్పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటకాలు వేసినప్పుడు కేవలం ఉత్తమ నటి అవార్డు మాత్రమే దక్కేదని, ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు లేవని తోటి కళాకారులు చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. తన చిన్నపాటి సంపాదనను కూడా ఇతరులకు సహాయం చేయడానికి వినియోగించానని, భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేదని ఆమె ఓ సందర్భంలో అంగీకరించారు. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అనే నానుడిని తాను పాటించలేకపోయానని, గుడ్డి వెలుగులో బతికాను అని ఆమె వ్యాఖ్యానించారు.

ఆమె కష్టాలకు ప్రధాన కారణం కుటుంబ మద్దతు లేకపోవడం. తాను, తన కుమార్తె మాత్రమే ఉండేవారని, తన నాటకాల సంపాదనతోనే ఇంటి అద్దె, బియ్యం కొనుగోలు చేసేవారని తెలిపారు. ఒక సందర్భంలో 15 రోజుల పాటు కేవలం గోంగూర, ఆనపకాయ ఉడకబెట్టుకుని తిని జీవనం సాగించినట్లు చెప్పారు. తన ఆత్మాభిమానం కాపాడుకోవాలనే తపనతో ఎవరినీ ప్రాధేయపడలేదని ఆమె అన్నారు. దిగ్గజ నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి ఒకసారి ఆమె ఇంటికి వచ్చి, “మీకు మగ దిక్కు లేకపోవటం వలనే ఇట్లా ఉన్నారు, ఇంత టాలెంట్ ఉండి.. ఇలా ఉండటం నాకే బాధగా ఉంది” అని అన్న మాటలను ఆమె అప్పట్లో గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలో ప్రముఖులు తనను గౌరవించినప్పటికీ, మంచి పాత్రలు మాత్రం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అది తన దురదృష్టమో, లేక తన ఫేస్ వాల్యూ లేకపోవడమో కావచ్చని అన్నారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల జూలై 28న మరణించారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో దుర్భర జీవితం గడిపారు శ్యామల. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. గతంలో ఒకట్రెండు సార్లు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకునే ఆర్థిక పరిస్థితి లేక అర్ధరాత్రి రోడ్లపై దీనంగా కనిపించారు.

గత కొన్ని రోజులుగా ఆమె ఉస్మానియాలోనే చికిత్స తీసుకుంటున్నారు. గతంలో శ్యామల పరిస్థితి తెలిసి పవన్ కళ్యాణ్‌తో పాటు సాయి దుర్గ తేజ్, దిల్ రాజు లాంటి పలువురు సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. 1985లో వచ్చిన ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన పావలా శ్యామల.. దానికంటే ముందు కూడా ఛాలెంజ్, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసారు. విలక్షణమైన మాటతీరు, అమాయకత్వంతో కూడిన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఆంధ్రావాలా’, ‘గోలీమార్’ లాంటి సినిమాల్లో శ్యామల కామెడీ అద్భుతంగా పండింది.

Loading...
Unable to load recommendations.
Follow Us