
తెలుగు సినీ చరిత్రలో విలక్షణమైన పాత్రలతో, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటులలో త్యాగరాజు ప్రముఖులు. కృష్ణా జిల్లా నుంచే ఎక్కువ మంది కళాకారులు సినీ పరిశ్రమకు వచ్చినా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకున్న కొద్దిమందిలో త్యాగరాజు, కాంతారావు, డాక్టర్ ప్రభాకర రెడ్డి వంటి వారు ఉన్నారు. సినిమాకు ప్రాంతీయ బేధాలు ఉండవని, ప్రతిభ ఒక్కటే కొలమానం అని నిరూపించిన గొప్ప నటుడు త్యాగరాజు. పగడాల త్యాగరాజు స్వస్థలం వరంగల్. ఆయన 1941 జనవరి 29న పి.ఆర్. నారాయణ స్వామి, ఇతిరాజమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వరంగల్‌లో పి.డబ్ల్యు.డి. సూపరింటెండెంట్‌గా పని చేసేవారు. త్యాగరాజుది విద్యావంతుల కుటుంబం. ఆయన అన్నలు, తమ్ముడు కూడా మంచి చదువులు చదివి ఉద్యోగాలు చేశారు. త్యాగరాజు కూడా బి.ఏ., ఎల్.ఎల్.బి. చదివారు. విద్యార్థి దశ నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక నాటకంలో అమ్మాయి వేషం వేసి, అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత పునర్జన్మ, దొంగ వీరుడు వంటి 50కి పైగా నాటకాల్లో నటించి అనేక బహుమతులు పొందారు.
పగడాల త్యాగరాజు సినిమా రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. 1964లో త్యాగరాజు ఎం.ఏ. చదువుతుండగా, తన తల్లి యతిరాజమ్మను సింగపూర్‌లోని తన అక్క దగ్గరకు పంపించడానికి మద్రాసు వెళ్లారు. అక్కడ సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు బంధువైన తన స్నేహితుడు ద్వారా చలపతిరావుకు పరిచయమయ్యారు. ఆ సమయంలో చలపతిరావు ఎన్.టి.ఆర్. హీరోగా మంచి మనిషి చిత్రం తీసే సన్నాహాల్లో ఉండేవారు. ఆయన దర్శకుడు ప్రత్యగాత్మకి త్యాగరాజును పరిచయం చేశారు. విలన్ పాత్రలకు ప్రసిద్ధుడై అకాల మరణం చెందిన ఆర్. నాగేశ్వరరావు పోలికలు త్యాగరాజులో ఉండటాన్ని గమనించిన ప్రత్యగాత్మ, ఆయనకు విలన్ పాత్రలో అవకాశం ఇచ్చారు. ఎన్.టి.ఆర్. అభిమాని అయిన త్యాగరాజు, తొలి చిత్రంలోనే ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో పొంగిపోయారు. మంచి మనిషిలో దొంగల ముఠా నాయకుడిగా నటించిన త్యాగరాజు ఆ చిత్రం విడుదలయ్యాక అనేక మంది దర్శకుల, నిర్మాతల దృష్టిని ఆకర్షించారు. ఆయన నటించిన రెండవ చిత్రం పల్నాటి యుద్ధం. ఇందులోనూ ఎన్.టి.ఆర్. హీరో. ఈ సినిమాలో వీరభద్రుడి వేషం కోసం దర్శకుడు రామిణీడు గుండు కొట్టించుకోవాలని చెప్పారు. అద్భుతమైన జుట్టు కలిగిన త్యాగరాజు మొదట విగ్గు పెట్టుకుంటానని చెప్పినా, రామిణీడు అంగీకరించలేదు. మూడు నెలల షూటింగ్ కోసమే కదా అని ఒప్పించారు. అయితే, చిత్రం షూటింగ్ దాదాపు 14 నెలలు జరగడంతో త్యాగరాజు అన్ని రోజులు గుండుతోనే ఉండాల్సి వచ్చింది. పల్నాటి యుద్ధంలో వీరభద్రుడి పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం చూసిన బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం చిత్రంలో త్యాగరాజుకు మంచి వేషం ఇచ్చారు. రంగులరాట్నం చిత్రం ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పింది. పాప కోసం చిత్రంలో కూడా ఆయనకు మంచి పాత్ర లభించింది. మధ్యలో మంచి పాత్రలు తగ్గినా, దర్శకుడు విఠలాచార్య అనేక జానపద చిత్రాల్లో మంచి వేషాలు ఇచ్చి త్యాగరాజును ప్రోత్సహించారు
. క్రైమ్ చిత్రాలకు డిమాండ్ తగ్గడంతో, తన సినీ ప్రస్థానం ముగిసిందనుకున్న తరుణంలో మిత్రుడు డాక్టర్ ప్రభాకర రెడ్డి గాంధీ పుట్టిన దేశం చిత్రంలో మంచి పాత్ర ఇచ్చి ఆదుకున్నారు. ప్రభాకర రెడ్డి సహాయం లేకపోతే వరంగల్ తిరిగి వెళ్లి వ్యాపారం చేసుకునే వాడిని అని త్యాగరాజు ఎన్నోసార్లు చెప్పేవారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా, తీరిక చేసుకుని నాటకాల్లో నటించేవారు. తన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి నెలకొల్పిన ప్రభాకర్ థియేటర్స్ తరపున అనేక నాటకాల్లో నటించారు. ఆయనకు తమిళ, హిందీ భాషలు కూడా తెలుసు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన త్యాగరాజు, అల్లూరి సీతారామరాజు చిత్రంలో బాస్టియన్‌గా కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. విలన్ పాత్రల్లోనూ హాస్యాన్ని మిళితం చేసి ప్రేక్షకులను అలరించిన అరుదైన నటుడు ఆయన. ఆయన చివరి చిత్రం ఈ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన ప్రేమ ఖైదీ. రంగులరాట్నం చిత్రంలోని “నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వత్తును” పాటతోనూ, సాయిబాబా మహత్యం చిత్రంలోని “సాయి శరణం బాబా శరణం” పాటలోనూ ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇందిరా గాంధీ పట్ల అపారమైన అభిమానం ఉన్న త్యాగరాజు, ఆమె మరణించినప్పుడు పది రోజుల పాటు దీక్ష పట్టారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే, త్యాగరాజు తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. తన అన్న పి. సుందరరాజు నాయుడు పెద్ద కుమారుడిని దత్తత తీసుకున్నారు. అన్నగారి కుమార్తె అనితను కూడా బాగా చదివించారు. తన తల్లి యతిరాజమ్మ జీవిత చరిత్రను మదర్ ఆఫ్ ఇండియా పేరుతో సినిమాగా తీయాలని నిర్ణయించుకొని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. 1991 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే, ఆయన పరమపదించారు.
(ఈ సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)