Tollywood: స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి.. ఈ అందాల నటి జీవితం కన్నీటి వ్యథ..
టాలీవుడ్ సీనియర్ నటి శ్రీ విద్య సినీ ప్రస్థానం చాలా గొప్పగా ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రేమ వైఫల్యాలు, మోసపూరిత వివాహం, ఆర్థిక కష్టాలు, క్యాన్సర్‌తో పోరాటం.. ఇలా అన్ని కూడా ఆమెను కుంగదీశాయి. కమల్ హాసన్‌తో ప్రేమ, జార్జ్ థామస్‌తో వైవాహిక జీవితం..

అభినయం, ఆకట్టుకునే అందంతో ప్రేక్షకులను అలరించిన నటి శ్రీ విద్య జీవితం తెరపై కనిపించినంత మురిపించేది కాదు. ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రేమించినవాడు దక్కలేదు, పెళ్లి చేసుకున్నవాడు మోసం చేశాడు. 1953 జులై 24న చెన్నైలో జన్మించిన శ్రీ విద్య తల్లి ఎం.ఎల్. వసంతకుమారి ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు. తండ్రి వికటన్ ఆర్. కృష్ణమూర్తి తమిళ చిత్రాల్లో హాస్యనటుడు. శ్రీ విద్య పుట్టిన కొంతకాలానికి తండ్రికి పక్షవాతం రావడంతో కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో 14 ఏళ్ల వయసులోనే, 1967లో శివాజీ గణేశన్ నటించిన పౌరాణిక చిత్రం “తిరువరుట్చెల్వర్”తో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఈ చిత్రంలో మహానటి సావిత్రి, జెమిని గణేశన్, కేఆర్ విజయ లాంటి నటులతో కలిసి శివశక్తి నందనం పాత్ర పోషించారు. ఆ తర్వాత 1969లో “కుమార సంభవం” చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు.
తెలుగులో శ్రీ విద్య తొలి చిత్రం 1969లో వచ్చిన “పేదరాశి పెద్దమ్మ కథ”. ఇందులో కాంతారావు సరసన రాజకుమారి పాత్రను పోషించారు. ఆ తర్వాత “తాత మనవడు” చిత్రంలో “రాయంటి నా మొగుడు రంగా మెళ్ళి తిరిగి రాలేదు” అనే ఐటెం సాంగ్‌లో కనిపించారు. హీరో కృష్ణ నటించిన “గాలిపటాలు” చిత్రంలో, అలాగే ఎన్టీఆర్ నటించిన “కథానాయకుని కథ”లో ఆయనకు చెల్లెలిగా, “రాముని మించిన రాముడు”లో ఆయన సరసన ఓ హీరోయిన్‌గా నటించారు. అయితే, 1975లో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి నటించిన తమిళ చిత్రం “అపూర్వ రాగంగళ్” తెలుగు రీమేక్ అయిన “తూర్పు పడమర”తోనే శ్రీ విద్యకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలోని “శివరంజని, నవరాగిణి” పాట ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయ్యారు.
తెలుగులో దర్శకరత్న దాసరి నారాయణరావు, తమిళంలో దర్శకుడు కే. బాలచందర్ శ్రీ విద్యకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. “నూట్రిక్కు నూరు”, “ఢిల్లీ టు మద్రాస్” చిత్రాలతో బాలచందర్ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. దాసరి తన తొలి చిత్రం “తాత మనవడు”లో సాంగ్ చేసే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత “బంట్రోతు భార్య”, “కన్యా-కుమారి” చిత్రాల్లో ముఖ్య పాత్రలు ఇచ్చారు. శ్రీ విద్య తర్వాత కాలంలో బాలకృష్ణ “ఇన్‌స్పెక్టర్ ప్రతాప్”, “రాముడు భీముడు”, “బంగారు బుల్లోడు”, “గాండీవం” వంటి చిత్రాల్లో, చిరంజీవి “కొండవీటి దొంగ”, “ముగ్గురు మొనగాళ్లు” చిత్రాల్లో, వెంకటేష్ “బ్రహ్మపుత్రుడు”(తల్లి పాత్ర), “చిన్నబ్బాయి”, “ధర్మచక్రం” చిత్రాల్లో, నాగార్జున “విక్కీ దాదా” చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆమె గాయనిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
వ్యక్తిగత జీవితంలో శ్రీ విద్య ఎన్నో కష్టాలను అనుభవించారు. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే ఆమె కమల్ హాసన్‌ను గాఢంగా ప్రేమించారు. కమల్ కూడా ఆమెను ప్రేమించారు. వారి వివాహం గురించి కమల్, శ్రీ విద్య అన్నయ్య శంకర్‌కు చెప్పారు. అయితే, శ్రీ విద్య తల్లి వసంతకుమారి వారి వివాహానికి అంగీకరించలేదు. ఇద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉండటం, శ్రీ విద్య కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకోవడం, కమల్ ఆమె కంటే ఏడాది చిన్నవాడు కావడం వంటి కారణాలతో ఆమె పెళ్లిని నిరాకరించారు. తల్లి మాటకు ఎదురు చెప్పలేక, ప్రేమించిన కమల్‌కు దూరమయ్యారు శ్రీ విద్య. కొంతకాలానికి కమల్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. కమల్‌కు దూరమైన తర్వాత, 1976లో మలయాళ చిత్రం “శ్రీ కన్నల్” నిర్మాత జార్జ్ థామస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మానసికంగా దగ్గరైన శ్రీ విద్య, జార్జ్ మాటలు విని ఆయన వలలో పడిపోయారు. బ్రాహ్మణ యువతి అయిన శ్రీ విద్య, క్రైస్తవుడైన జార్జ్ వివాహానికి ఆమె తల్లి మళ్ళీ అంగీకరించలేదు. అయితే, ఈసారి తల్లి మాట వినకుండా, జార్జ్‌తో కలిసి ముంబై వెళ్లి క్రైస్తవ మతం స్వీకరించి 1978 జనవరి 8న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి దాంపత్య జీవితం గడిపారు.
ఆ తర్వాత మళ్ళీ ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జార్జ్ తీసిన సినిమాలు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో శ్రీ విద్యను మళ్ళీ సినిమాల్లో నటించి డబ్బు సంపాదించమని జార్జ్ ఒత్తిడి చేశారు. ఆమె నటనను తిరిగి ప్రారంభించగా, జార్జ్ ఆమె సంపాదనపై ఆధారపడి వేధించడం, అనుమానించడం మొదలుపెట్టారు. అతని వేధింపులు భరించలేక ఇంట్లోంచి బయటకు వచ్చిన శ్రీ విద్య, కోర్టు ద్వారా 1988లో విడాకులు తీసుకున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమె ఆర్థికంగా, మానసికంగా ఎంతో నలిగిపోయారు. సత్యసాయి బాబా భక్తురాలైన శ్రీ విద్య, బాబా ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పేవారు. జీవితంతో ఎంతో పోరాడిన శ్రీ విద్య చివరికి క్యాన్సర్‌తో మూడు సంవత్సరాలు పోరాడారు. చివరి వరకు నటించడం, తీరిక వేళల్లో బాబా నామసంకీర్తనం చేయడం ఆమె అలవాటు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఎవరినీ కలవడానికి ఇష్టపడకపోయినా, కమల్ హాసన్ తరచూ వెళ్లి ఆమెను పరామర్శించేవారు. “జీవితంతో అన్ని విధాలా పోరాడి అలసిపోయాను, ఆ భగవంతుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా” అని కమల్‌తో చెప్పేవారట శ్రీ విద్య. చివరి రోజుల్లో చెన్నై వదిలి తిరువనంతపురంలో స్థిరపడ్డారు. తను చనిపోవడానికి రెండు నెలల ముందు, తన బంధువు సాయంతో ఒక ట్రస్ట్‌ను నెలకొల్పి, తన ఆస్తినంతా పేద విద్యార్థుల చదువు, సంగీతం, నాట్యం కోసం వినియోగించాలని వీలునామా రాశారు. తన అన్నయ్య పిల్లలు ఇద్దరికీ చెరో 5 లక్షలు, ఇంట్లో పనివాళ్లకు తలో లక్ష రూపాయలు ఇచ్చి 2006 అక్టోబర్ 19న తుదిశ్వాస విడిచారు.
