Anand Sai: రాయదుర్గం హిట్ అండ్‌ రన్ కేసు.. ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన టీటీడీ బోర్డ్ మెంబ‌ర్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Anand Sai: రాయదుర్గం హిట్ అండ్‌ రన్ కేసు.. ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
Anand Sai Son

Updated on: Sep 01, 2026 | 5:55 PM

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుల సమాచారం ప్రకారం.. రాయదుర్గం ప్రధాన రహదారిపై నందులాల్‌ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని  గమనించిన జైద్‌ షా ఖాద్రీ అనే విద్యార్థి వెంటనే స్పందించాడు. నందూలాల్ ను ఆస్పత్రికి తరలించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అయితే ఇదే క్రమంలో మరో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది.  వెనుక నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కారు.. వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అప్పటికే తీవ్రంగా గాయపడిన నందులాల్‌ ప్రాణాలు కోల్పోయాడు.  జైద్‌ షా ఖాద్రీకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత మహీంద్రా కారు కూడా అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది.దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా నందులాల్‌ను ఢీకొట్టిన ఇన్నోవా కారును గుర్తించిన పోలీసులు.. ఆ వాహనం సందీప్‌కు సంబంధించినదిగా ధ్రువీకరించారు. అనంతరం  సందీప్‌ను  వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నందూలాల్ ను రెండోసారి ఢీకొట్టిన మహీంద్రా కారును కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు సమాచారం. ఈ వాహనాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us