
ఒకవైపు త్రిష పుట్టినరోజు కాగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో త్రిష తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం నేరుగా చెన్నైలోని హీరో కమ్ పొలిటీషియన్ విజయ్ నివాసానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన విశేషాలు, ఆమె ధరించిన దుస్తుల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఎంతో హుందాగా ఉండే సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఆమె ధరించిన దుస్తులపై గూగుల్ లెన్స్ ద్వారా ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. అజా ఫ్యాషన్స్ బ్రాండ్‌కు చెందిన ఈ అందమైన ఫ్లోరల్ సూట్ ధర సుమారు రూ. 12,000 అని తెలిసింది. వేసవి కాలపు వేడికి సరిపోయేలా ఐవరీ రంగులో ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్త్రంతో దీనిని రూపొందించారు. వి-నెక్, త్రీ-ఫోర్త్ స్లీవ్స్, సైడ్ స్లిట్స్‌తో ఉన్న ఈ డ్రెస్‌కు జతగా స్ట్రెయిట్ ప్యాంట్స్, తేలికపాటి ఫ్లోరల్ దుపట్టాను ధరించారు. వేసవి తాపానికి సౌకర్యంగా ఉంటూనే ఎంతో ట్రెండీగా కనిపించేలా ఈ కాంబినేషన్‌ను ఎంచుకున్నారు.
ఆదివారం రాత్రి ప్రయాణం చేస్తున్న ఒక వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా, సోమవారం ఉదయం ఆమె ఆలయ ప్రాంగణంలో భక్తులకు కనిపించింది. ఆమెను చూడగానే అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయ అర్చకులు ఆమెకు అందించిన పవిత్రమైన ఎరుపు రంగు శేష వస్త్రాన్ని భుజాలపై వేసుకుని ఆమె ఆలయం వెలుపలికి వచ్చింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని ఆమె ఈ ప్రత్యేక రోజున తిరుమలకు వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆమె తిరుమల పర్యటన కేవలం పుట్టినరోజు కోసమే కాకుండా.. తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజున జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల దర్శనం ముగించుకున్న వెంటనే చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఆమె పర్యటన, ఈ భేటీ ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.