
తాజాగా టాలీవుడ్‌లో దశాబ్దాల తర్వాత కలుస్తున్న సీనియర్ జంటల నుండి, నేటి తరం క్రేజీ కపుల్స్ వరకు పలువురు ‘హిట్ పెయిర్స్’ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకరు మెగాస్టార్.. మరొకరు సౌత్ ఇండియన్ క్వీన్. సుమారు 20 ఏళ్ల క్రితం ‘స్టాలిన్’ అంటూ సమాజం కోసం పోరాడిన ఈ జంట, ఇప్పుడు ఒక సోషియో ఫ్యాంటసీ లోకంలోకి తీసుకెళ్లబోతున్నారు.
అలాగే ఒకప్పటి రొమాంటిక్ హిట్ జంట మైసూర్ వీధుల్లో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇక రియల్ లైఫ్ లో ఒక్కటైన క్రేజీ కపుల్, రీల్ లైఫ్ లో తమ మూడో సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నారు. ఇలా పాత, కొత్త తరం హిట్ జంటలు మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ క్రేజీ కాంబినేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో 2006లో వచ్చిన ‘స్టాలిన్’ ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంతో ఈ జోడీ రిపీట్ అవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ఈ వేసవిలో విడుదల కానుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ అలరించే అద్భుతమైన కథ ఇదని చిరంజీవి ఇప్పటికే భరోసా ఇచ్చారు.
Tabu N Nagarjuna
అక్కినేని నాగార్జున, టబు అనగానే మనకు ‘నిన్నే పెళ్లాడతా’ గుర్తుకు రాక మానదు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఒక ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’లో అలరించిన ఈ జంట, సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్ళీ జతకడుతున్నారు. నాగార్జున కెరీర్ లో మైలురాయి లాంటి 100వ సినిమాలో ( కింగ్ 100) టబు హీరోయిన్ గా నటిస్తున్నారు. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది.
Vijay And Rashmika
రీల్ లైఫ్ లో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకుని రియల్ లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలనా కాలం నాటి చారిత్రక ఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
వెండితెరపై ఒకసారి మెప్పించిన ఈ హిట్ జంటలు, రెండోసారి లేదా మూడోసారి కూడా అదే మేజిక్ ను రిపీట్ చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయని ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.