Tollywood : 14 ఏళ్లకే తోపు హీరోయిన్.. అందంలో ఏకంగా శ్రీదేవితోనే పోటీ.. ముగ్గురు పిల్లలున్న వ్యక్తితో పళ్లి..
80వ దశకపు అందాల రాణి గురించి తెలుసా. ఆమె అసలు పేరు లలితారాణి, నాట్యం, సంగీతం పట్ల ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశారు. అంతులేని కథ, సిరిసిరిమువ్వ చిత్రాలతో స్టార్డమ్ సాధించి, అన్ని భాషల్లోనూ నటించారు. కెరీర్లో విజయాలు అందుకున్నా, వ్యక్తిగత జీవితంలో వైవాహిక సమస్యలు, పోటీలు, ఆత్మహత్య ప్రయత్నంతో ఎన్నో విషాదాలు చవిచూశారు. ఆమె అంతులేని పోరాట కథ ఇది.

ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా?. ఆమె మరెవరో కాదు.. జయప్రద. 1962 ఏప్రిల్ 3న కృష్ణ, నీలవేణి దంపతులకు మూడవ సంతానంగా లలితారాణి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, కుమార్తె కోరికలను తీర్చడానికి ఎంతో కష్టపడ్డారు. నాట్యం, సితార్ వంటి విద్యలు నేర్పించారు. చిన్నతనం నుంచే లలితారాణికి నటన పట్ల ఆసక్తి పెరిగింది. ఆమె తమ్ముడు రాజబాబుతో కలిసి ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణావతారం చిత్రాన్ని 18 సార్లు చూసి, ఆయనకు వీరాభిమానిగా మారారు. తన అభిమాన హీరో పక్కన భవిష్యత్తులో హీరోయిన్గా నటిస్తానని అప్పట్లో ఊహించి ఉండరు. ఆమె కుటుంబానికి ఫైనాన్షియర్‌గా ఉన్న రవణం శ్రీరాములు, జయప్రదను సినిమాల్లోకి తీసుకురావాలని బలంగా కోరుకున్నారు. మద్రాసు తీసుకెళ్లి ఎన్టీఆర్‌ను కలిపేవారు. పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రవేశ పరీక్షలో సెలెక్ట్ కాకపోయినా, రాజమండ్రిలో వనసుందరి అనే గేయనాటిక ప్రదర్శిస్తున్నప్పుడు దర్శకుడు కె.బి. తిలక్ దృష్టిలో పడ్డారు. భూమి కోసం చిత్రంలో డైలాగులు లేని చంద్రమ్మ పాత్ర ద్వారా జయప్రద సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి నాకు స్వాతంత్ర్యం వచ్చింది చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో లలితారాణి పేరు జయప్రదగా మారి, ఆమె జాతకం కూడా మారింది.
కృష్ణ సరసన శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 45 సినిమాల్లో కృష్ణ, జయప్రద జోడీగా నటించి ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్‌తో అడవి రాముడు బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో ఎన్టీఆర్‌తో నటించిన ఏకైక కథానాయికగా జయప్రద నిలిచారు. దర్శకుడు కె. బాలచందర్ అంతులేని కథ చిత్రంలో 14 ఏళ్ల జయప్రదకు ప్రధాన పాత్ర ఇచ్చి, ఆమె నటనలోని ప్రతిభను వెలికితీశారు. ఆ పాత్ర కోసం ఆమె మేకప్‌తో లావుగా కనిపించేలా చేసి, భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సినిమా విజయం తర్వాత కె. విశ్వనాథ్ సిరిసిరిమువ్వలో మూగ యువతి పాత్రను ఇచ్చారు. ఈ చిత్రాలు జయప్రదను స్టార్డమ్కు తీసుకెళ్లాయి. వాణిశ్రీ కెరీర్ ముగింపు దశలో జయప్రద మాస్ ప్రేక్షకులను, జయసుధ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఒలమ్మీ తిక్కరేగిందా వంటి పాటలు ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టాయి. అక్కినేని, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి అగ్రతారలందరితో నటించి, బహుభాషల్లో తన నటనతో మెప్పించారు. ఎన్.ఎన్.సిప్పి సర్గం చిత్రంతో ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. 80కి పైగా హిందీ చిత్రాల్లో నటించి, బాలీవుడ్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించారు. సాగర సంగమం చిత్రంలో కమలహాసన్‌తో పోటీ పడి నటించి, నటిగా తన విశ్వరూపాన్ని చూపించారు.
జయప్రద వ్యక్తిగత జీవితం మాత్రం విజయాల బాట పట్టలేదు. ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను 1986లో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహితుడైన శ్రీకాంత్, మొదటి భార్యేకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను పెళ్లి చేసుకున్నారు. దీని వల్ల ఆమె ఎన్నో మానసిక క్షోభలు అనుభవించారు. శ్రీకాంత్ మొదటి భార్య చంద్ర వేధింపులు తట్టుకోలేక 1990లో జయప్రద ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. పిల్లలు లేకపోవడంతో తన సోదరి కొడుకు సిద్ధార్థ్‌ను దత్తత తీసుకున్నారు. ఇటీవల శ్రీకాంత్ నహతా కన్నుమూశారు. ఎన్టీఆర్ అభిమానంతో 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా, ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో ఎంపీగా రాజకీయాల్లోనూ సేవలు అందించారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించినా, వ్యక్తిగత జీవితంలో జయప్రద ఎన్నో వివాదాలు, విషాదాలను ఎదుర్కొని నిలబడ్డారు.
