పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker). ఆ తర్వాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మెగా ఫోన్ ను పక్కన పెట్టి యాక్టింగ్ వైపు అడుగులేశారు. మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాలో నటించి మెప్పించారు. సినిమా రిలేజ్ట్ ఎలా ఉన్నా తరుణ్ నటనకు యాటిట్యూడ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలాజీ అనే పాత్రలో కనిపించనున్నారు తరుణ్ భాస్కర్. కానీ లాంగ్ బ్రేక్ తరువాత మరోసారి డైరెక్షన్‌లో బిజీ అవుతున్నారు తరుణ్.. వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ.. తన మెయిన్ స్ట్రెంగ్త్‌కు పదును పెట్టే పనిలో ఉన్నారు.
దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న టైమ్‌లో నటుడిగా మారినట్టే… ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్న టైమ్‌లో మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్. ఆల్రెడీ కీడా కోలా పేరుతో ఓ క్రైమ్ కామెడీ మూవీని ఎనౌన్స్ చేశారు. అంతకన్నా ముందే ఓ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్‌గా రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న టైమ్‌లో మరో మూవీని లైన్‌లో పెడుతున్నారు. మహానటి సినిమాలో సింగీతం శ్రీనివాస్ పాత్రలో నటించారు తరుణ్. ఇప్పుడు ఆయన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైన , ప్రయోగాత్మకమైన సినిమాలకు దర్శకత్వం వహించి అటు ప్రేక్షకులనూ ఇటు విమర్శకులనూ మెప్పించారు సింగీతం శ్రీనివాస్ . మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నటుడిగా.. సంగీత దర్శకుడిగానూ మెప్పించారు. ఇక ఇప్పుడు ఆయన జీవిత కథతో సినిమా రానుంది. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో తరుణ్ భాస్కరే నటిస్తారా..? లేక మరో నటుడ్ని తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి