
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతోన్న ఓ విద్యార్థికి ఆపన్న హస్తం అందించాడు. చదువుకు అయ్యే ఖర్చుల కోసం వెంటనే రూ. 25వేలు అందించారు. అంతే కాదు ఇక పైఆ విద్యార్థి చదువు విషయంలో పూర్తి బాధ్యత తనే తీసుకుంటున్నట్లు మాట ఇచ్చాడు. విజయ్ తో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సాయంలో పాలు పంచుకున్నారు. విద్యార్థి కష్టాలు విని చలించిపోయిన ఈ సంగీత దర్శకుడు అతనికి మోటార్ బైక్ కొనిస్తానని మాటిచ్చాడు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కోవిల్పట్టికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఓ టీవీ ఛానెల్ వేదికగా తన కష్టాలను పంచుకున్నాడు. ‘నేను మార్కెట్ యార్డ్లో మూటలు మోస్తూ చదువుకుంటున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదవుకుంటూనే ఈ పని చేస్తున్నాను. మూటలు మోయడం వల్ల నా భుజాలు బాగా నొప్పి పెడుతున్నాయి. కానీ అమ్మకు ఆసరా కల్పించేందుకు ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నాను. ఈ విషయం మా అమ్మకు ఇంకా తెలియదు. రోజు కనీసం 5 గంటలైనా పని చేస్తన. ఒక్కోసారి రాత్రి పూట బస్సులు లేకపోతే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాను’ అంటూ తన బాధను వెళ్లగక్కాడు.
దీనికి సంబంధించిన వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హీరో దళపతి విజయ్ దాకా కూడా చేరింది. దీంతో వెంటనే స్పందించిన అతను విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. దీనిపై సదరు విద్యార్థి తల్లి స్పందిస్తూ.. ‘ నా బిడ్డ మాటలకు చలించిపోయిన విజయ్ సార్ మాకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మా అబ్బాయి కాలేజీ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని 25 వేల రూపాయాలు ఇచ్చారు. అంతేకాకుండా మా కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకును కూడా విజయ్ అందించారు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు’ అని ఎమోషనల్ అయ్యారు.
ఇదే వీడియోను చూసి స్పందించిన తమన్ ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.