ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. వరుస మరణాలు, సమస్యలు, కేసులు.. సినీ పరిశ్రమలో కాంతార పూజలు..

|

Aug 14, 2024 | 11:35 PM

ఎనిమిది మంది ప్రత్యేక పూజారుల బృందం ఈ పూజను నిర్వహిస్తోంది. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, సర్ప శాంతి హోమాలను నిర్వహిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన దొడ్డన్న దంపతులు ఈ పూజలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీనియర్ నటి శాంత, మాలతి శ్రీ మైసూర్, పద్మజారావు .. దీప ధూపాలను సమర్పించి.. ప్రత్యేక దీప బెళగిపూజను ప్రారంభించారు.

ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. వరుస మరణాలు, సమస్యలు, కేసులు.. సినీ పరిశ్రమలో కాంతార పూజలు..
Kannada Industry
Follow us on

ప్రాణాల కోసం పూజలు చూశాం.. పదవుల కోసం యాగాలు చూశాం.. డబ్బు కోసం హోమాలు చూశాం.. ఇప్పుడు ఓ రంగం కోసమే జరుగుతున్న యజ్ఞం చూడబోతున్నాం. ఇది కన్నడ సినీ పరిశ్రమలో జరుగుతున్న అతిపెద్ద పూజ. కాంతార సెట్టింగులను మించి ఇక్కడ హోమ గుండాలను ఏర్పాటు చేసి.. శాండల్‌వుడ్‌ పరిశ్రమ కోసం పూజలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ట్రాజడీలు.. వివాదాలు.. సినిమా ఫ్లాపులు అన్నింటి నుంచి విముక్తి కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలింది. దీని పరిష్కారం కోసం మహా యజ్ఞం చేయడం తప్ప మరో మార్గం లేదని డిసైడ్‌ అయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. దీంతో కళాకారుల సంఘం .. బెంగళూరు చామరాజ్‌ పేటలోనే తమ ఆఫీస్‌లోనే సుబ్రహ్మణ్య సర్ప శాంతి హోమం పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఎనిమిది మంది ప్రత్యేక పూజారుల బృందం ఈ పూజను నిర్వహిస్తోంది. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, సర్ప శాంతి హోమాలను నిర్వహిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన దొడ్డన్న దంపతులు ఈ పూజలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీనియర్ నటి శాంత, మాలతి శ్రీ మైసూర్, పద్మజారావు .. దీప ధూపాలను సమర్పించి.. ప్రత్యేక దీప బెళగిపూజను ప్రారంభించారు.

నిజానికి కన్నడ ఇండస్ట్రీలో కొంత కాలంగా చాలా చూస్తోంది. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అన్నట్లుగా తయారైంది ఇండస్ట్రీ. కరోనా తర్వాత కొందరు నటులు చనిపోవడం ఇండస్ట్రీ జీర్నించుకోలేకపోతోంది. సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి నుంచి కన్నడ పరిశ్రమ ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. ఆయన హఠాన్మరణంతో శాండల్‌వుడ్‌ షేక్‌ అయింది. ఇండస్ట్రీలోనే టాప్‌మోస్ట్‌ స్టార్‌ గుండెపోటుతో చనిపోయాక.. ఆ పరిశ్రమలో అలజడి మొదలైంది. ఆయన మృతి తర్వాత ఎంతో మంది అభిమానులు ప్రాణాలు వదలడం కూడా ఇండస్ట్రీ చూసింది. ఇప్పటికీ పునీత్‌ రాజ్‌కుమార్‌ లేని లోటు అక్కడ కనిపిస్తోంది. పునీత్‌ రాజ్‌కుమారే కాదు.. మరికొందరు నటులు కూడా మరణించారు.. సంచారి విజయ్‌, సత్యజిత్‌, జయంతి, శరత్‌ బాబు, మాండ్య రవి, రాజేష్‌, నితిన్‌ గోపి, లక్ష్మణ్‌, అపర్ణ వంటి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ నాలుగైదేళ్లలోనే చనిపోయారు. సీరియల్‌ నటి పవిత్ర జయరాం.. ఆతర్వాత జరిగిన వివాదం కూడా ఇండస్ట్రీకే చుట్టుకుంది. ఇక యువ నటుడు చిరంజీవి సర్జ మృతి కూడా చాలామందిని షాక్‌కు గురిచేసింది. 2020 జూన్‌లో ఈ 39 ఏళ్ల యువనటుడు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. నటుడు విజయ్‌ రాఘవేంద్ర భార్య.. స్పందన రాఘవేంద్ర అకాల మరణం కూడా ఎంతో కుంగదీసింది.

ఇక వివాదాలకు కన్నడ పరిశ్రమ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హీరో దర్శన్‌ తన అభిమానినే అత్యంత దారుణంగా చంపడం సంచలనం రేపింది. తన ప్రేయసి పవిత్ర గౌడ సోషల్‌ మీడియా పోస్టుల కింద రేణుకాస్వామి అనే అభిమాని బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టాడన్న కోపంతో.. అతడిని టార్చర్‌ చేసి లేపేశాడు దర్శన్‌. ఈ వివాదంతో శాండల్‌వుడ్‌కి చెడ్డపేరు వచ్చిందన్న అభిప్రాయంలో ఉంది ఇండస్ట్రీ. పరిశ్రమపై చెడు దృష్టి ఉందని పెద్దలు నమ్ముతున్నారు. ఇక కన్నడ నటుడు చేతన్‌ చంద్రపై 20మంది ఒకేసారి దాడి చేయడం కూడా అప్పట్లో కలకలం రేపింది.

ఇక కన్నడ ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు కూడా నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను కలచివేస్తున్నాయి. కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2, కాంతార తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ కనిపించడం లేదు. ఎంతో హైప్‌ ఇచ్చిన కబ్జా, టోబీ, రాజమార్తాండ వంటి సినిమాలు వచ్చినా అవి నిరాశపరిచాయి. ఈ ఏడాది విడుదలైన దర్శన్‌ గారడి, బ్యాచిలర్‌ పార్టీ, సూపర్‌ స్టార్‌ శివన్న నటించిన కరటక ధమనక, మత్స్యగంధ లాంటి సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అసలు కోవిడ్‌ తర్వాత కన్నడ ఇండస్ట్రీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఓటీటీల ప్రభావంతో చిన్నా చితక సినిమాలు విడుదలకు కూడా నోచుకోలేకపోతున్నాయి. ఇలా ఇండస్ట్రీని ఒకదాని తర్వాత ఒక వివాదం, విషాదం వెంటాడుతుండడంతో నటీనటులు అంతా కలిసి హోమం ప్రారంభించారు. ‘రాహు, కేతువుల దృష్టి నుండి తప్పించుకోవడానికి ఈ పూజలను ప్రారంభించారు. ఇలా ఈ మూడు రకాల పూజల కోసం ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది.