
కమర్షియల్ కథలు, హంగులకు దూరంగా ప్రేక్షకుల ఊహలకు అందని కాన్సెప్టులతో సినిమాలు తీశారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు సింగీతం. సినిమా దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన.. తదితర రంగాల్లోనూ సింగీతం తన ట్యాలెంట్ చూపించారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ఇంకా ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అపూర్వ సహోదరులు’.. ఇలా సింగీతం కెరీర్ లో ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. చివరకు 95ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ (2026) అనే మ్యూజిక్ ఫాంటసీ సినిమాను ఆడియెన్స్ కు అందించిన సింగీతం ఇవాళ (అక్టోబర్ 04)న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఈ లెజెండరీ డైరెక్టర్ కు అశ్రు నివాళి సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా స్థాయిని పెంచిన సింగీతం శ్రీనివాసరావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. గ్రాండ్ గా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్టు వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది.
జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటర్నేషనల్ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు సింగీతం. ఏసుక్రీస్తు జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి అందించిన సందేశాలను నేటి తరానికి చెప్పాలని ఒక మంచి కథను రెడీ చేసుకున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కథానాయకుడిగా తీసుకున్నారు. పవన్ ది జీసస్ పాత్ర కాదని, కానీ కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ రోల్ అని అని సింగీతం చెప్పుకొచ్చారు. అలాగే అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2010 లో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. విజయేంద్ర వర్మ, శ్రీ రామదాసు వంటి సినిమాలు నిర్మించిన కొండా కృష్ణంరాజు ఈ సినిమాకు నిర్మించేందుకు ముందుకొచ్చారు.
ప్రిన్స్ ఆఫ్ పీస్’ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం వంటి భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించాలని సింగీతం ప్లాన్ చేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్, సింగీతం, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసు క్రీస్తు నడయాడిన ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి, సినిమాను అత్యంత సహజంగా ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించాలనుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి పోయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనున్న తరుణంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లకుండానే అర్ధాంతంగా ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం బడ్జెట్. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఇంటర్నేషనల్ లొకేషన్లు, విజువల్స్, రెమ్యునరేషన్ల కోసం అంచనా వేసిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. మరోవైపు కథ, స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కూడా రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈలోగా పవన్ కల్యాణ్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో జీసస్ క్రైస్ట్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఒక వేళ పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చివుంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచేదన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది.
శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న చిత్రాలు రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.