
సిల్క్ స్మితాగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన విజయలక్ష్మి జీవితం ఒక ఆకట్టుకునే ప్రయాణం. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె సినీ పరిశ్రమలో అగ్రతారగా ఎదిగినా, ఆమె చివరి రోజులు విషాదకరంగా ముగిశాయి. 1960 డిసెంబర్ 2న ఏలూరు దగ్గర కొవ్వలిలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు జన్మించిన విజయలక్ష్మి, బంధువుల దత్తతతో ఏలూరుకు మారింది. చిన్నతనం నుంచే సినిమాలపై అమితమైన ప్రేమను పెంచుకుంది. 18 ఏళ్ల వయసులో నటి కావాలనే ఆకాంక్షతో తన తల్లితో కలిసి మద్రాస్ చేరుకుంది. సినిమా అవకాశాల కోసం ఆమె ఎదుర్కొన్న తిరస్కరణలు ఎన్నో. ఆమెకు గ్లామర్ లేదని, నటిగా పనికిరాదని పలువురు నిర్మాతలు ఆమెను నిరాశపరిచారు. అయితే, ఆ అవమానాలను తట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాలలో నటించి, తన పేరును విజయగా మార్చుకుంది. అప్పట్లో నల్లగా, బొద్దుగా ఉన్న విజయకు మలయాళంలో వచ్చిన అవకాశమే ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది. భాషతో సంబంధం లేకుండా, గ్లామరస్ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే మలయాళ చిత్ర పరిశ్రమ ఆమెను ఆహ్వానించింది. మొదట తటపటాయించినా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించి, అందాల ప్రదర్శనకు వెనుకాడలేదు. మొదటి మలయాళ చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయలక్ష్మి, తమిళ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. తమిళంలో వండి చక్రం చిత్రంతో ఆమె జీవితం మారిపోయింది. ఈ చిత్రంతోనే సిల్క్ స్మితాగా రూపాంతరం చెంది, తన రొమాంటిక్ డాన్సులతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. వండి చక్రం చిత్రాన్ని తెలుగులో ఘరానా గంగులు పేరుతో రీమేక్ చేయగా, అందులో శోభన్ బాబుతో కలిసి స్మితా నటించారు. ఇక అప్పటినుండి ఏ హీరో సినిమా అయినా స్మితా డాన్స్ ఉండాల్సిందే అనేంత డిమాండ్ ఏర్పడింది.
ఒక్క నృత్య సన్నివేశం కోసం 45 ఏళ్ల క్రితమే 50 వేల రూపాయలు డిమాండ్ చేసినా, నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టేవారు. 1981 నుంచి 1996 వరకు స్మితా కెరీర్ ఉజ్వలంగా కొనసాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించి, అగ్ర డ్యాన్సర్‌గా పేరుపొందారు. ఆమె పాట లేని సినిమా హిట్ అవ్వదని ప్రేక్షకులు భావించేవారు. 1983లో వచ్చిన నీతిపతి చిత్రానికి సిల్క్ స్మితా పాటనే విజయాన్ని అందించింది. నృత్యతారగానే కాకుండా లేడీ జేమ్స్ బాండ్ వంటి చిత్రాలలో నటనా ప్రాధాన్యమున్న పాత్రలను పోషించారు. స్వయంగా వీర విహారం, ప్రేమించి చూడు చిత్రాలను నిర్మించారు. అభిమానులతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. షూటింగ్ విరామ సమయంలో ఆమె కొరికిన యాపిల్‌ను 26,000 రూపాయలకు వేలం వేసిన ఘటన ఆమె క్రేజ్‌కు నిదర్శనం. అయితే, ఇంతటి విజయాలను అందుకున్న స్మితా జీవితం డాక్టర్ రాధాకృష్ణ అనే వ్యక్తి ప్రవేశంతో మలుపు తిరిగింది. అతను పెళ్లైన వ్యక్తి అయినప్పటికీ, స్మితా అతనితో సన్నిహితంగా మెలిగేదని అప్పటి ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతుంటారు. 1996 సెప్టెంబర్ 22న 36వ ఏట స్మితా ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తన మానసిక క్షోభను వెల్లడించారు. “దేవుడా నా ఏడవ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు. అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరేవారే. ఎవరికీ విశ్వాసం లేదు,” అని ఆమె లేఖలో రాశారు. ఈ సంఘటన తర్వాత పరిశ్రమ నుంచి చాలామంది ఆమె చివరి చూపుకు రాలేదు, కానీ నటుడు అర్జున్ మాత్రం హాజరయ్యారు. 2011లో ఆమె జీవిత కథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ అనే హిందీ చిత్రం విడుదలై విజయం సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.