
రుక్మిణి వసంత్.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మడు.. 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1 మూవీతో వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా అంతగా మెప్పించలేదు. కానీ రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇందులో ప్రియా పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల స్విమ్మింగ్ ఫూల్ వద్ద పొట్టి దుస్తులతో ఫోటోషూట్ జరిగినట్లు సోషల్ మీడియాలో ఫోటోస్ వైరలవుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన రుక్మిణి ఇలాంటి ఫోటోషూట్ చేయడమేంటనీ నెటిజన్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఫోటోస్ అన్నీ ఫేక్ అని నటి రుక్మణి వసంత్ స్పష్టం చేశారు. ఏఐ సాయంతో అసభ్యకర రీతిలో తన ఫోటోలను క్రియేట్ చేసి నెట్టింట పోస్ట్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో ఫేక్ ఫోటోస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.

ఏఐ సాయంతో క్రియేట్ చేసిన అసభ్యకరమైన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుడం నేను, నా టీమ్ గుర్తించాం. అవన్నీ ఫేక్.. ఏఐ సాయంతో క్రియేట్ చేశారు. ఇలా ఫోటోస్ క్రియేట్ చేయడం.. సమాచారం షేర్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే. అంతేకాదు మా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ వ్యవహారాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫోటోలను క్రియేట్ చేసిన వారితోపాటు ఆన్ లైన్ వేదికగా వైరల్ చేస్తున్న వారిపైనా న్యాయ, సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు ప్రారంభించాం. ఇలాంటి కంటెంట్, ఫోటోస్, ఆన్ లైన్ వేదికగా పంచుకోవడం మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు రుక్మిణి వసంత్.

ఏఐ సాయంతో హీరోయిన్స్ ఫేక్ వీడియోస్, ఫోటోస్ క్రియేట్ చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో చాలా మంది తారల డీప్ ఫేక్ వీడియోస్, ఫోటోస్ వైరల్ కాగా.. సదరు హీరోయిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు రుక్మిణి వసంత్ ఫోటోస్ సైతం ఏఐ సాయంతో అసభ్యకర రీతిలో మార్చేశారు. గతంలో సినిమా, పబ్లిక్ ఈవెంట్స్ కు హాజర్యే హీరోయిన్లను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీయడం పైనా రుక్మిణి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జూమ్ చేసి మరీ తమ శరీరాలను ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు. ఇప్పుడు ఏఐ సాయంతో ఏకంగా తనవే ఫేక్ ఫోటోస్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. తన సహజసిద్ధమైన నటనతో, కళ్లతోనే హావభావాలు పలికించే ప్రతిభతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న రుక్మిణికి ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీతోపాటు తెలుగులో మరిన్ని చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తున్నట్లు సమాచారం.