
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా నిర్మాత కే. నాగేశ్వరరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో అంతకుముందు చేసిన ఒక సినిమా అంతగా విజయం సాధించకపోవడం.. అందులో చిరంజీవి నెగటివ్ రోల్ పోషించడం వల్లే, ఈసారి కచ్చితంగా పెద్ద హిట్ ఇవ్వాలని నాగేశ్వరరావు సంకల్పించారట. చిరంజీవి అప్పటివరకు చేయని కౌబాయ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. కౌబాయ్ చిత్రానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందని చిరంజీవి హెచ్చరించినా, “ఈసారి తీసే సినిమా మాకు అవుట్ స్టాండింగ్ ఫిలిం అవ్వాలి” అనే ఉద్దేశంతో నిర్మాత ముందుకెళ్లారు. కైకాల సత్యనారాయణ లాంటి సీనియర్ నటుడు కూడా బడ్జెట్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసినా, డబ్బింగ్ హక్కులు(తమిళ, హిందీ), పక్కా ప్లాన్ ద్వారా ఖర్చును కంట్రోల్ చేయగలనని నాగేశ్వరరావు నమ్మకం ఉంచారు. తమ బ్యానర్‌కు ఒక పెద్ద సినిమా తీసిన గుర్తింపు ఉండాలని ఆయన ఆశించారు.
‘కొదమ సింహం’ చిత్రం 96 రోజుల పాటు అవుట్‌డోర్ షూటింగ్ జరుపుకుంది. గుర్రాలను లారీలలో వేర్వేరు లొకేషన్లకు తీసుకెళ్లడం అప్పట్లో ఒక పెద్ద టాస్క్. కేవలం టైటిల్ ఎపిసోడ్ కోసమే పది విభిన్న ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు. ఇది ఆ రోజుల్లో మిగతా సినిమాల సగటు బడ్జెట్(2.5-3 కోట్లు) కంటే ఎక్కువే అయినప్పటికీ, ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నందున తమకు పెద్ద కష్టంగా అనిపించలేదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం డబ్బింగ్ హక్కుల అమ్మకం, కొన్ని జిల్లాల్లో సొంతంగా విడుదల చేయడం ద్వారా లాభాలు ఆర్జించిందని పేర్కొన్నారు.
రామ్ చరణ్‌కు ‘కొదమ సింహం’ అంటే ఎంత ఇష్టమో కూడా నాగేశ్వరరావు వివరించారు. చిన్నతనంలో చరణ్ ‘కొండవీటి దొంగ’, ‘కొదమ సింహం’ చిత్రాల క్యాసెట్లు పెడితే తప్ప భోజనం చేసేవాడు కాదట. ఈ సినిమా చూసే గుర్రపు స్వారీ నేర్చుకున్నానని, ‘కొదమ సింహం’ తనకిష్టమైన చిత్రమని రామ్ చరణ్ అనేకసార్లు చెప్పారని నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. ఇక సినిమాలో మోహన్ బాబు పోషించిన కామెడీ రోల్ మొదట ఇంటర్వెల్‌లో చనిపోయేలా రాశారని, అయితే సినిమాకు వినోదం లోటు అవుతుందని చిరంజీవి భావించి, పరుచూరి బ్రదర్స్‌తో మాట్లాడి పాత్రను పొడిగించమని చెప్పారని వెల్లడించారు. ఈ మార్పు సినిమా విజయానికి ఎంతో సహాయపడిందని అన్నారు.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..