Amaran: అమరన్​ మూవీ షో నడుస్తున్న థియేటర్‌పై బాంబ్ దాడి.. రీజన్ ఇదే!

|

Nov 16, 2024 | 7:57 PM

అమరన్...ఈమధ్యకాలంలో సూపర్‌ హిట్ అయిన మూవీల్లో ఇదొకటి. అలాగే సూపర్‌ కాంట్రవర్శీ అయిన మూవీ మాత్రం ఇదొక్కటే. ట్రైలర్‌ రిలీజ్ నుంచి నేటి వరకు నాన్‌స్టాప్‌గా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి..అయినా అమరన్ తన రన్ ఆపట్లేదు. కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈరేంజ్ హిట్ సినిమా మేకర్సే ఊహించలేదు. అలాగే ఈరేంజ్ కాంట్రవర్సీ కూడా వాళ్లు ఊహించిఉండరు. ఇంతకూ అమరన్ ఎందుకింత వివాదాస్పదమైంది. ఇందులో అంతగా అభ్యంతరం చెప్పే సీన్స్ ఏంటి..?

Amaran: అమరన్​ మూవీ షో నడుస్తున్న థియేటర్‌పై బాంబ్ దాడి.. రీజన్ ఇదే!
Amaran Movie
Follow us on

అమరన్….ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ తమిళనాడులో ఓ వర్గాన్ని ఆకట్టుకోలేకపోయింది. 172కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది…కానీ తమిళనాడులోని కొందరి మనసులకు దగ్గరకాలేకపోయింది. అందుకు కారణం ఒకే ఒక్క సీన్. కాశ్మీరీలను తప్పుగా చూపించారంటూ ట్రైలర్ విడుదలైన డేవన్ నుంచి మూవీకి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మాట్లాడుతూనే ఉన్నాయి. నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా థియేటర్‌పై పెట్రోల్ బాంబు విసిరేదాకా వచ్చింది. సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ.. తమిళనాడులో అమరన్​ మూవీ షో నడుస్తున్న థియేటర్‌పై బాంబ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

విశ్వనటుడు కమల్‌హాసన్ నిర్మించిన మూవీ ఇది. రాజ్‌ కుమార్‌ పెరియసామి డెరెక్షన్‌లో తమిళ హీరో శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించారు. సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీలో ఓ వర్గాన్ని చెడుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ, తమిళ మక్కల్ జననాయక కచ్చి TMJK రాజకీయ సంస్థ గత కొంతకాలంగా నిరసన తెలుపుతూ వస్తోంది. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ‘అమరన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్ లో హీరో శివకార్తికేయన్‌ ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంతో ప్రజెంట్‌ చేసారు. కాశ్మీర్ లోని టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో భారత ఆర్మీని నడిపించే పవర్ ఫుల్ మేజర్ పాత్రలో చూపించారు. ఓవైపు దేశభక్తిని మరోవైపు యాక్షన్‌ అంశాలతో ప్రేక్షకులను మెప్పించింది. కాని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఓ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఓవర్గానికి చెందిన నేతలు నిరసనలకు దిగారు.

పెట్రోల్ బాంబు దాడికి వివాదాస్పద సన్నివేశాలే కారణమా..లేక మరో కోణం ఉందా అన్నదానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిలీజ్‌ కాకముందు నుంచే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలంటూ….కమల్‌హాసన్‌ ఇంటి దగ్గర ఆందోళన కూడా చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ప్రస్తుతం అమరన్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర భద్రత పెంచారు.

భార‌త ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ పై రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్తకం అధారంగా‘అమరన్‌’ సినిమా తెరకెక్కింది. రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.
ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అశోక చక్ర భారత ప్రభుత్వం ప్రకటించింది.

అమరన్ మూవీపై నిరసనలు గత కొంతకాలం నుంచి జరుగుతున్న మాట నిజమే…కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడమూ వాస్తవమే..కానీ దేశవ్యాప్తంగా సినిమా విడుదలైనా ఎక్కడా ఇలాంటి నిరసనలు చోటు చేసుకోలేదు. మరి తమిళనాడులోనే ఎందుకు జరుగుతున్నాయన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హీరో అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.