
పక్కింటి కుర్రాడు సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యూట్యూబర్ చందు సాయి. పలు షార్ట్ ఫిల్మ్స్ చేసి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కానీ కొన్ని నెలల క్రితం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే కేసుపై దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చందు సాయి మాట్లాడుతూ తన బాధను బయటపెట్టాడు. అసలు ఏం జరిగింది ? అనే విషయాలను చెప్పుకొచ్చాడు. “ఎవరిమీదనా పగ తీర్చుకోవడానికి మరీ ఇంత దూరం వెళ్లకూడదు. ఉన్నది చెప్తే ఓకే కానీ లేనిది కల్పించడం అవసరమా ?.. తప్పు కదా.. అంత పగ ఎవరీ మీద పట్టకూడదు. పగకు కూడా కొన్ని విలువులు ఉండాలి. నా ఫ్యామిలీ మెంబర్స్ పై కేసు పెట్టారు. అదింకా చాలా పెద్ద తప్పు. వాళ్లు ఎంత బాధపడతారు ?.. 27 రోజులు జైల్లో ఉన్నారు. మూడు రోజులు కంటిన్యూగా ఏడ్చాను.. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని బాధను దిగమింగుకుని బతుకుతున్నాను.
ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు పోయింది. నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకే దిమ్మతిరిగేలా చేసి కేసు పెట్టారు. ఎంతో కష్టపడి పక్కింటి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాను. నా కడుపు మీద కొట్టారు. ఈ కేసు వల్ల ఓ సినిమా పోయింది. నా మీద కేసు ఫైల్ అయ్యిందే తప్ప దోషినని రుజువు కాలేదు. దయచేసి ఎవరు నన్నలా చూడకండి. అయినా ఈ సమాజంలో అబ్బాయిలకు రక్షణ లేదు. తప్పు జరిగితే ఇద్దరూ చేస్తారు. కానీ శిక్ష ఒక్కరికే పడుతుంది. ఈ విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ” అంటూ ఎమోషనల్ అయ్యాడు చందు.
యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ చేసి ఫేమస్ అయ్యాడు చందు సాయి. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా 13 లక్షల మంది సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని..ప్రేమిస్తున్నాని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. సదరు యువతి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.