
తెలుగు సినీ పౌరాణికాలలో నటరత్న ఎన్టీఆర్ పురాణ పాత్రల పోషణలో 1963వ సంవత్సరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన నాలుగు పౌరాణిక చిత్రాలు – శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, లవకుశ, నర్తనశాల – విడుదలయ్యాయి. వీటిలో నర్తనశాల ప్రత్యేకంగా నిలిచింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో, రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా ద్విపాత్రాభినయం చేశారు. బృహన్నల పాత్ర ఎన్టీఆర్‌కు ఒక సవాల్‌గా నిలిచింది. రావణుడు లేదా భీష్ముడి వంటి పౌరుష పాత్రలు కాకుండా.. అటు ఆడ, ఇటు మగ కానీ బృహన్నల పాత్రను పోషించడానికి ఆయన మొదట సందేహించారు. ఆర్ట్ డైరెక్టర్ టీవీఎస్ శర్మ లోతైన రీసెర్చ్ చేసి.. బృహన్నల గెటప్‌ను రూపొందించారు. శిల్ప, వాస్తు శాస్త్రాలు, కేరళ కేశాలంకరణ, ఆంధ్రా మహిళల చొక్కాలు, రాయలసీమ ఆభరణాలు, కేరళ తలపాగాలను అధ్యయనం చేసి, 10 రకాల గెటప్‌లను సృష్టించారు. వాటిలో రెండు సినిమా కోసం సెలక్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ ప్రముఖ రూపశిల్పి హరిబాబుతో మేకప్ చేయించుకొని, తన గురువు కేవీ రెడ్డి ఆమోదం పొందిన తర్వాతే బృహన్నల పాత్రకు సమ్మతించారు. ఉత్తరకు నృత్యం నేర్పే బృహన్నల పాత్ర కోసం, ఎన్టీఆర్ నృత్య దర్శకుడు వెంపటి పెదసత్యం వద్ద ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో మహానటి సావిత్రి ద్రౌపది పాత్రను పోషించడానికి తొలుత ఒప్పుకోలేదు, తన బరువు కారణంగా పాత్రకు తగినట్లు లేనని భావించారు. అయితే ఎన్టీఆర్, ఆమె భర్త జెమినీ గణేశన్ నచ్చజెప్పడంతో ఆమె అంగీకరించారు. ద్రౌపదిగా సావిత్రి అద్భుత అభినయం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
Also Read: బస్సు డ్రైవర్ కొడుకు.. పేద కుటుంబం.. కట్ చేస్తే.. ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాల డైరెక్టర్
మహానటుడు ఎస్వీ రంగారావు కీచకుడి పాత్రలో కనిపించింది కొద్దిసేపే అయినా, తన అభినయంతో ఆ పాత్రను చిరస్మరణీయం చేశారు. కేవలం నాలుగు రోజుల్లో తన వర్క్ పూర్తి చేసి, అద్భుత వాచికాభినయంతో ప్రతి నాయక పాత్రను ప్రేమించేలా చేశారు. 1964లో జకార్తాలో జరిగిన ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, నర్తనశాలలోని తన నటనకు గాను ఎస్వీ రంగారావు అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణో చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. కళా దర్శకుడు టీవీఎస్ శర్మ కూడా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అభిమన్యుడిగా శోభన్ బాబు నటించారు. ఎన్టీఆర్ కుమారుడిగా అందమైన నటుడు కావాలని దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పట్టుబట్టగా, ఆ పాత్ర శోభన్ బాబుకు దక్కింది. ఎల్. విజయలక్ష్మి ఉత్తరగా, రేలంగి ఉత్తర కుమారుడిగా, మిక్కిలినేని ధర్మరాజుగా, దండమూడి రాజగోపాల్ భీముడిగా, ముక్కామల విరాటరాజుగా నటించి మెప్పించారు. ఎల్. విజయలక్ష్మి, శోభన్ బాబులపై షూట్ చేసిన ఎవరికోసం చెలి మందహాసం పాట విశేష ప్రజాదరణ పొందింది. 1963 అక్టోబర్ 11న విడుదలైన నర్తనశాల, అప్పటికే లవకుశ, బందిపోటు, లక్షాధికారి, శ్రీ తిరుపతమ్మ కథ వంటి ఎన్టీఆర్ చిత్రాలు విజయవంతంగా రన్ అవుతుండగా విడుదలైంది. ఈ చిత్రం 1964లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎన్నికై, అటువంటి అవార్డు పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. 1963 నుంచే అవార్డులు ఇవ్వడం ప్రారంభించిన ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది పురస్కారాల్లో నర్తనశాల ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. 1975లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. తొలి విడుదలలోనే సూపర్ హిట్ అయిన ఈ చిత్రం 26 కేంద్రాలలో 50 రోజులు, 19 కేంద్రాలలో 100 రోజులు, విజయవాడ, హైదరాబాద్‌లలో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లోకి డబ్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది.