
కళ్లతోనే హావభావాలను పలికిస్తూ.. తన చెల్లితో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించింది. ఈమెకు అబ్బాయిల్లో ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ముద్దుగా ఈ అందాల భామను ‘చందమామ’ అని పిలుచుకుంటారు. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో ఈపాటికి అర్ధమై ఉంటుంది.
కాజల్ అగర్వాల్.. మన తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. తొలి సినిమాతోనే అటు అందం.. ఇటు అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. రెండో చిత్రంతోనే ఫ్యాన్స్ కాజల్‌కు ‘చందమామ’ అనే నిక్‌నేమ్ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. 2020వ సంవత్సరంలో కాజల్ అగర్వాల్ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది.
2004లో హిందీలో ‘క్యు.! హో గయా నా’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. తెలుగులో 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’తో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాలో కాజల్‌కు నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘చందమామ’ సినిమాతో ఎంతోమంది ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ‘మగధీర’, ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బిజినెస్ మాన్’, ‘ఎవడు’, ‘టెంపర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జనతా గ్యారేజ్’, ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. 2020 అక్టోబర్ 30వ తేదీన తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడింది కాజల్ అగర్వాల్. కాగా, ప్రస్తుతం కాజల్ నటించిన ‘ఆచార్య’, ‘హే సినమికా’, ‘కరునగాపియం’, ‘ఘోస్టీ’, ‘ఉమ’ సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి.