
నటి జ్యోతి పూర్వజ్ ఇటీవలే కిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి పూర్వజ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించి, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న నటుడు ముఖేష్ గురించి ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. రియాలిటీ షోలలో పాల్గొనే అవకాశం గురించి జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ, తనకు బిగ్ బాస్ నుండి మూడు సార్లు ఆహ్వానం అందిందని చెప్పారు. అయితే, తాను వాటిలో పాల్గొనడానికి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ తన కప్ ఆఫ్ టీ కాదని, తాను జనాల నుంచి కాస్త దూరంగా ఉండటానికి ఇష్టపడతానని ఆమె వివరించారు. ఐదు, పది నిమిషాలు కలిసిన తర్వాత వెళ్లిపోవడమే తనకు సంతోషాన్నిస్తుందని, పోటీలలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని అన్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన నటుడు ముఖేష్ గురించి అడగ్గా, అతనిపై వస్తున్న విమర్శల పట్ల ఆమె స్పందించారు. హౌస్‌లో ఏం జరుగుతుందో, అక్కడి పరిస్థితులు ఏమిటో తనకు తెలియదని, కాబట్టి ఇతరులు అతన్ని అంచనా వేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తన బంధువు అయిన చైత్రా రాయ్ గురించి, ముఖేష్ గురించి తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసని జ్యోతి అన్నారు. వారు ఎలాంటివారో, ఎలా ప్రవర్తిస్తారో తనకు బాగా తెలుసని, కేవలం షోలో చూసి దాని ఆధారంగా వారిని అంచనా వేయడం సరికాదని అన్నారు. “వాళ్ళు హౌస్ లో 90 రోజులు ఉంటే, నేను మూడు సంవత్సరాలు వారితో కలిసి పని చేశాను” అని ఆమె అన్నారు. ముఖేష్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, అతను చాలా దృష్టి సారించే వ్యక్తి అని, తన కెరీర్‌పై పూర్తి శ్రద్ధ చూపుతాడని జ్యోతి పూర్వజ్ తెలిపారు. నటుడిగా ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని అతను నిరంతరం కృషి చేస్తాడని చెప్పారు. శారీరక ఫిట్నెస్ను కాపాడుకోవడానికి కృషి చేస్తాడని, జిమ్నాస్టిక్ కూడా నేర్చుకున్నాడని గుర్తు చేసుకున్నారు. ముఖేష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని, తల్లిదండ్రులు, సోదరి అంటే అతనికి ఎంతో ఇష్టమని, వారి బాధ్యతలను ఎప్పుడూ మర్చిపోడు అని అన్నారు. తన ఇంటి బాధ్యతల గురించి, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఎవరికీ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడని జ్యోతి పేర్కొన్నారు. అతను అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని జ్యోతి తెలిపారు.
ముఖేష్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ, గతంలో తనతో ముఖేష్‌కు ఒకటి, రెండు సార్లు గొడవ జరిగిందని జ్యోతి పూర్వజ్ వెల్లడించారు. “అప్పుడు నేను సోషల్ మీడియాలో లేను. అతనికి చాలా పాపులారిటీ వచ్చింది కదా, నువ్వేం కాదు అనే ఒక టోన్ వచ్చింది. నా అనుభవం ఏంటి, నువ్వేంటి అనుకుని ఇద్దరం గొడవ పడ్డాం” అని ఆమె వివరించారు. ఈ గొడవ తర్వాత దాదాపు వారం రోజుల పాటు మాట్లాడుకోలేదని, ఆ తర్వాత మళ్లీ కలిసిపోయి స్నేహితులుగా మారినట్లు చెప్పారు. “అతను నాకు ఒక చిన్న పిల్లవాడి లాంటివాడు” అని జ్యోతి అన్నారు. అయితే, ప్రస్తుతం బిగ్ బాస్‌లో ముఖేష్ ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జ్యోతి పూర్వజ్ తెలిపారు. తాను తెలిసిన ముఖేష్ తన ఎదుగుదల పట్ల కొంచెం స్వార్థపరుడని, “నేను ఎదగాలి, నాకు మంచి పేరు రావాలి, అందరూ నన్ను ఇష్టపడాలి” అని కోరుకుంటాడని అన్నారు. అయితే, బిగ్ బాస్‌లో అతను పక్కన వాళ్ళు బాగుండాలి, వారి ఆట బాగుండాలి అని ఫీల్ అవుతున్నట్లు తనకు వార్తలు వస్తున్నాయని, ఇది తనకు షాకింగ్‌గా ఉందని చెప్పారు. బహుశా ఈ మూడు, నాలుగు సంవత్సరాలలో అతను మారి ఉండవచ్చని, లేదా బయటి నుంచి ఎవరైనా అతనిని బాగా ప్రభావితం చేసి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తాను బిగ్ బాస్ సిరీస్‌ను చూడకపోయినా, వింటున్న విషయాలు మాత్రం తనకు కొత్తగా ఉన్నాయని జ్యోతి పూర్వజ్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి