AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్నాక్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌‌కు తెగ ఇష్టం.. అల్లం, వేరుశెనగ చట్నీతో రుచి చూడాల్సిందే మరి

సిల్వర్ స్క్రీన్‌పై తన నటనతో, డ్యాన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే గ్లోబల్​ స్టార్​.. భోజనం విషయంలో మాత్రం పక్కా లోకల్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరుగుతూ, రకరకాల వంటకాలను రుచి చూసినా, సాయంత్రం వేళ తన మనసు కోరుకునే ఆ చిరుతిండి ఏంటో చెప్పేశారు.

ఈ స్నాక్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌‌కు తెగ ఇష్టం.. అల్లం, వేరుశెనగ చట్నీతో రుచి చూడాల్సిందే మరి
Junior Ntr Alias Tarak
Nikhil
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 8:40 AM

Share

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వీధుల్లో దొరికే ఆ హాట్ స్నాక్ పేరును అంతర్జాతీయ మేగజైన్ ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పడం ఆయన అభిమానులను మురిపిస్తోంది.

ఆయన ఒక గ్లోబల్ స్టార్. ఆయన సినిమా వస్తోందంటే దేశం మొత్తం ఎదురుచూస్తుంది. 42 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా ఎనర్జీతో కనిపించే ఈ హీరో.. తన డైట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక లోకల్ స్నాక్ కనిపిస్తే మాత్రం అస్సలు ఆగలేరట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకెంతో ఇష్టమైన అల్పాహారం గురించి ఆయన మనసు విప్పి మాట్లాడారు. ఆ మాస్ హీరో మరెవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్. తారక్‌కు ఎంతో ఇష్టమైన ఆ స్నాక్​ ఏంటో తెలుసా?

పునుగులపై మక్కువ..

“దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మా హైదరాబాద్‌లో వీటిని పునుగులు అని పిలుస్తాం” అని ఎన్టీఆర్ చాలా గర్వంగా చెప్పారు. ఇవి చిన్న చిన్న భజీలాల్లా ఉంటాయని, వీటిని అల్లం పచ్చడి లేదా వేరుశెనగ చట్నీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందని ఆయన వివరించారు.

మన తెలుగు రాష్ట్రాల్లో వీధి చివర బండి దగ్గర దొరికే ఈ పునుగుల రుచి గురించి అంతర్జాతీయ వేదికపై తారక్ ప్రస్తావించడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. పునుగులు అంటే ఇడ్లీ లేదా దోశ పిండితో తయారు చేసే ఒక లోకల్ స్నాక్. పులిసిన పిండికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కలిపి నూనెలో డీప్ ఫ్రై చేస్తే కరకరలాడే పునుగులు సిద్ధమవుతాయి. ఇవి పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.

ఎన్టీఆర్‌కు ఇష్టమైన ఈ పునుగులను ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో తయారు చేసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి. ఒక కప్పు బియ్యం, పావు కప్పు మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మెంతులు, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర ఈ స్నాక్​ తయారీకి కావలసిన పదార్థాలు. ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, మెంతులను 4-5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత తక్కువ నీటితో మెత్తగా, కాస్త గట్టిగా పిండిని రుబ్బుకోవాలి. ఈ పిండిలో ఉప్పు కలిపి రాత్రంతా పులియబెట్టాలి.

ఉదయం లేదా సాయంత్రం వండే ముందు పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కలిపి చిన్న చిన్న ఉండలుగా కాగుతున్న నూనెలో వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీస్తే వేడి వేడి పునుగులు రెడీ. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా, తన మూలాలను, తన ప్రాంతపు ఆహారాన్ని తారక్ మర్చిపోలేదు. పునుగుల వంటి ఒక సాధారణ వంటకం గురించి ఆయన అంత గొప్పగా చెప్పడం గమనార్హం.

Follow Us