జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేశ్ ఒకరు. మొదట సాధారణ కమెడియన్‌గా షోలోకి అడుగుపెట్టిన అతను ఆతర్వాత తన కామెడీ పంచులు, డైలాగులతో టీం లీడర్‌గా ఎదిగిపోయాడు. ఇక జోర్దార్ సుజాతతో కలిసిన తర్వాత రాకేశ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. జబర్దస్త్ వేదికపై ఈ జోడీకి ఎంతో క్రేజ్ ఉంది. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీరిద్దరూ ప్రేమ పక్షులన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు కూడా సమాచారం. అందుకే ఎక్కడ చూసిన జంటగానే కనిపిస్తారీ లవ్‌బర్డ్స్. ముఖ్యంగా రాకేశ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వెంటనే వాలిపోతోంది సుజాత. కాగా ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి పెదవి విప్పిన జబర్దస్త్ రాకేశ్ తన ప్రేయసి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అలాగే కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను మరోసారి గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయ్యాడు. ‘ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వరంగల్ వదిలి హైదరాబాద్ వచ్చాను. 11 ఏళ్ల పాటు ఎన్నో ఆఫీసులు తిరిగాను. ప్రారంభంలో కొన్ని మిమిక్రీ ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు చేసుకునేవాడిని. ఈవెంట్లు పూర్తయ్యాక పేమెంట్ ఇచ్చేదాకా వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం. సరిగ్గా చేయలేదంటూ రూ.500 ఇచ్చినా అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని. ధనరాజ్ అన్న నన్ను కామెడీ షోకి తీసుకెళ్లడంతో నా లైఫ్ టర్న్ తీసుకుంది. ఆయన వల్లే నేనిప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను’
‘ప్రస్తుతం రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నాకు తగిన గుర్తింపు, డబ్బు ఉంది కానీ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. ఒక్కోసారి అమ్మ పస్తులుండి మాకు అన్నం పెట్టేది. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. అవన్నీ దాటుకుని ఇక్కడిదాకా వచ్చాను. అప్పుడప్పుడూ నేను శ్మశానానికి వెళ్లి అక్కడే పడుకుంటాను. ఎందుకంటే అక్కడ నాకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక సుజాత విషయానికొస్తే.. పెళ్లంటే నాకు అసలు మంచి అభిప్రాయమే లేదు. అసలు పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. కానీ పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానని అమ్మ బెదిరించింది. ఎప్పుడైతే సుజాత పరిచయమైందో అప్పుడు నా అభిప్రాయం మారింది. ముందుగా ఆమే నన్ను ఇష్టపడింది. మా ఫ్యామీలీకి కూడా బాగా నచ్చింది. అలా మా ప్రేమకు పునాది పడింది’ అని చెప్పుకొచ్చాడు రాకేశ్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..