
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. గురువారం (జనవరి 01) ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆశ్రయం పొందుతోన్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) లో షేర్ చేసిన సజ్జనార్ నేటి యువతకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. ‘నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల గారిని పరామర్శించాను. కష్టకాలంలో ఉన్న ఆమెను ఆదుకుని, ఈ హెల్త్‌కేర్ సెంటర్‌లో చేర్పించిన మన తిరుమలగిరి ఏసీపీ రమేష్ చొరవ అభినందనీయం. గత 18 ఏళ్లుగా వేలాది మందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న డాక్టర్ రామకృష్ణ గారి సేవ స్ఫూర్తిదాయకం’
‘ఈ సందర్భంగా నాదొకటే విన్నపం.. ‘వృద్ధాశ్రమాలు లేని సమాజం’ రావాలి. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత సేవ చేసినా తీరనిది. ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్ల సాకుతో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయవద్దు. చరమాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు.. పిల్లల ఆప్యాయత, నాలుగు తీపి మాటలు మాత్రమే. తల్లిదండ్రులను భారంగా కాకుండా.. బాధ్యతగా, దైవంగా భావిద్దాం. వారి సేవలోనే నిజమైన ఆనందం, మోక్షం వెతుక్కుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!’ అని రాసుకొచ్చారు సజ్జనార్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను.
సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది… pic.twitter.com/C0s4KcmBDh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.