Vijay Sethupathi: అంతర్జాతీయ వేదికపై విజయ్ సేతుపతి.. అరుదైన ఘనత సాధించిన మక్కల్ సెల్వన్

విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు విజయ్ సేతుపతి. ఆయనకు ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Sethupathi: అంతర్జాతీయ వేదికపై విజయ్ సేతుపతి.. అరుదైన ఘనత సాధించిన మక్కల్ సెల్వన్
Vijay Sethupathi

Updated on: Nov 06, 2026 | 9:24 AM

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా, తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ ప్రతిభకు ప్రతినిధిగా నిలవబోతున్నారు. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. ఈ వార్తతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 23, 2026న న్యూయార్క్‌లో 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలో అవార్డులు అందించే ప్రెజెంటర్లలో విజయ్ సేతుపతి కూడా ఒకరిగా ఉండనున్నారు. అంతే కాదు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించబోతున్నారు.

గతంలో ప్రియాంక చోప్రా 2016లో జరిగిన 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకలో హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్‌స్టన్‌తో కలిసి అవార్డును అందించారు. అయితే ఇంటర్నేషనల్ ఎమ్మీ వేడుకలో ప్రెజెంటర్‌గా వ్యవహరించడం విజయ్‌కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలవనుంది. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో నిర్మాత, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో హాస్యనటుడు వీర్ దాస్‌ను ఇంటర్నేషనల్ ఎమ్మీ వేడుకకు హోస్ట్‌గా తీసుకురావడంలోనూ ఆమె పాత్ర ఉంది.

ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికొస్తే ఇటీవల బత్తా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. అలాగే విజయ్ సేతుపతి చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ సినిమాలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నారు. మరోవైపు మైస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ట్రైన్’ సినిమాలోనూ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అలాగే ‘పాకెట్ నవల్’ అనే మరో ప్రాజెక్ట్ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మహారాజా’ సినిమా ఇప్పుడు హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 2024లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్‌ను ఇంగ్లీష్‌లో రీమేక్ చేసేందుకు ఓ హాలీవుడ్ ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో కూడా మహారాజ  సినిమాకు మంచి స్పందన వచ్చింది. దాంతో హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us