ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ క్రమంగా స్లో అవుతోంది. వసూళ్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్‌ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. చాలా చోట్ల సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో సీనియర్ నటుడు సుమన్ ఆదిపురుష్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. నాగార్జున- రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. తాజాగా ఆదిపురుష్‌పై స్పందించిన ఆయన.. ‘ రావణాసురుడు సీతను అపహరించడం నుంచి రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ తీశారు. ఇక మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో రాముడికి మీసాలు, గడ్డాలు ఉండవు. అయితే ఇందులో ఆదిపురుష్ లో రాముడిని సాధారణంగా చూపించి చాలా పెద్ద రిస్క్ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ను మెచ్చుకోవచ్చు. సుమారు రెండున్నరేళ్లపాటు ఆ బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయమేమీ కాదు. అందుకు ప్రభాస్‌ను మెచ్చుకోవాల్సిందే’
‘ఇక ఆదిపురుష్ సినిమాలో డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. రావణుడి వేషధారణ మార్చడం చాలా తప్పు. ఇక గ్రాఫిక్స్ విషయానికొస్తే.. కొన్ని చోట్ల అద్భుతంగా ఉంటే మరికొన్ని చోట్ల పాత దానిలా ఉన్నాయి. జానకిగా కృతిసనన్ బాగా చేసింది. అయితే సినిమాలో చాలా వరకు ఎమోషన్ మిస్ అయ్యింది. ఆదిపురుష్ అనేది ఒక పవర్ఫుల్ టైటిల్. అయితే సినిమా చూసి చాలా నిరాశ చెందాను. ఇలాంటి సినిమాలను దక్షిణాది వాళ్లే బాగా హ్యాండిల్ చేస్తారు’ అని సుమన్ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి..