
భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి శారద. మూడుసార్లు ఊర్వశి జాతీయ అవార్డులను అందుకున్న ఆమె, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శారద గారి సినీ ప్రస్థానం, ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శారద అసలు పేరు సరస్వతి. ఆమె 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు బంగారు వ్యాపారి, తల్లి సత్యవతి. శారద బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా భరతనాట్యంలో ఆమెకు మంచి పట్టు ఉండేది. ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే, అది సాధించే వరకు వదిలిపెట్టే తత్వం ఆమెది. ఈ పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయి నటిగా ఎదిగేలా చేసింది. ఆమె కుటుంబం చేనేత సామాజిక వర్గానికి చెందినప్పటికీ, సినిమా పట్ల శారదకు ఉన్న అభిరుచిని ఆమె తల్లి సత్యవతి ప్రోత్సహించారు. చిన్న వయసులోనే వివాహాలు జరిగే ఆ రోజుల్లో, శారద తల్లి ఆమె కలలను సాకారం చేసుకోవడానికి అండగా నిలిచారు
పద్మశ్రీ బ్యానర్ పతాకంపై బి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కన్యాశుల్కం చిత్రంతో శారద బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో కొన్ని చిన్న హాస్యపాత్రలు, సహాయక పాత్రలు పోషించారు. ఇద్దరు మిత్రులు చిత్రంలో నాగేశ్వరరావు గారి చెల్లెలి పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. శారద సినీ ప్రస్థానంలో కీలక మలుపు మలయాళ చిత్రసీమలో లభించిన గుర్తింపు. అక్కడ ఆమె అద్భుతమైన విజయాలు సాధించి, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. మలయాళంలో లభించిన విజయాల తర్వాత తెలుగులో ఆమెకు మనుషులు మారాలి చిత్రంతో విశేష ప్రజాదరణ లభించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మొదటి ఊర్వశి అవార్డు దక్కింది. ఈ సినిమా అప్పట్లో సమాజంపై ఎంతగానో ప్రభావం చూపింది. పేదరికం, దారిద్య్రం కారణంగా కొందరు తల్లులు తమ పిల్లలను చంపుకునే స్థాయికి చేరుకున్నప్పుడు, శారద వారికి ఉత్తరాలు రాసి, సినిమాలో తాను పోషించింది కేవలం పాత్ర మాత్రమేనని, అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ఆమె నటిగా చూపిన సామాజిక బాధ్యతకు నిదర్శనం.
నిమజ్జనం చిత్రానికి కూడా శారద ఊర్వశి అవార్డును అందుకున్నారు. శారదకు తెలుగులో శోభన్ బాబుతో ఉన్న జోడీ అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. వారిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. తెరపై వారి కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు నిజంగా భార్యాభర్తలుగా భావించేవారని చెప్పడానికి అనేక సంఘటనలు నిదర్శనం. కాకినాడ, యానం ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న కె. విశ్వనాథ్ దర్శకత్వంలోని ఒక సినిమాలో శారద పోషించిన పాత్ర అద్భుతం. భర్తను కోల్పోయిన భార్యగా ఆమె చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఆ సినిమా సిల్వర్ జూబిలీ ఆడింది. శారద తన కెరీర్‌లో హాస్య పాత్రల నుంచి హీరోయిన్‌గా, ఆపై బలమైన, సంక్లిష్టమైన పాత్రల వైపు ప్రయాణించి, తన బహుముఖ నటనను నిరూపించుకున్నారు. ఆమె సినీ ప్రయాణం కేవలం విజయాల కలబోత మాత్రమే కాదు, పట్టుదల, ప్రతిభ, సామాజిక స్పృహలకు నిదర్శనం. దాదాపు 400ల సినిమాలు చేశారు. కానీ ఆమె నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశారు. శారదా జీవితంలో ప్రేమ, పెళ్లి అన్నీ వేగంగా జరిగిపోయాయి. నటుడు చలంతో వివాహం జరిగింది. చలం తన కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారదకంటే ముందే రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక కారణాలతో చలం, శారదల మధ్య మనస్పర్థలు తలెత్తి, వారు విడిపోవాల్సి వచ్చింది. ఇంట్లోంచి వెళ్ళిపోయి, విడాకుల నోటీసు పంపి చలం నుండి విడిపోయారు. శారద ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎక్కువ కాలం నిలవలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి