
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో జతకట్టాలని చాలామంది హీరోయిన్లు కోరుకుంటారు. అయితే కొందరు నటీమణులు తమ పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేకమైన అభిరుచిని చూపిస్తుంటే.. మరికొందరు మాత్రం సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇంకొందరు హీరోల తండ్రులతోనూ, వారి కుమారులతోనూ సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్ మాత్రం దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి నటించినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం పూర్తిస్థాయి హీరోయిన్‌గా కనిపించలేదు. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల భామ.. యంగ్ హీరోలతోనూ విజయవంతమైన సినిమాలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల నటి అనుష్క శెట్టి.
అనుష్క శెట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ తన సత్తా చాటింది. నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ‘డాన్’, ‘రగడ’, ‘డమరుకం’ వంటి సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించి మెప్పించింది. మరోవైపు విక్టరీ వెంకటేష్‌తో ‘చింతకాయల రవి’ సినిమాలో జతకట్టింది. నందమూరి బాలకృష్ణతో ‘ఒక్క మగాడు’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించి అభిమానులను అలరించింది.
ఇలా టాలీవుడ్‌లోని పలువురు అగ్ర హీరోలతో నటించిన అనుష్క.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. అనుష్క కెరీర్‌లో అరుంధతి సినిమా ఓ కీలక మలుపు. ఈ చిత్రంలో ఆమె పోషించిన జేజమ్మ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఆ తర్వాత వేదం, రుద్రమదేవి వంటి చిత్రాల్లోనూ తన నటనతో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో అనుష్క క్రేజ్ దేశవ్యాప్తంగాపెరిగిపోయింది. ఈ చిత్రాల విజయంతో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. ఇన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనుష్క శెట్టి.. మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు పూర్తిస్థాయి హీరోయిన్‌గా జతకట్టలేదు. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. అలాగే ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిసింది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ చిరంజీవి సరసన కథానాయికగా నటించే అవకాశం ఆమెకు రాలేదు. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుష్క.. మెగాస్టార్‌తో హీరోయిన్‌గా నటించకపోవడం అభిమానులకు ఆసక్తికరమైన విషయమే. భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటారనడంలో సందేహం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.