లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటేస్ట్ చిత్రం అన్నపూరణి. ఈ ఆమె 75వ సినిమాగా వ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జయ్, సత్యరాజ్, రెడిన్ కింగ్స్ లీ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. థియేటర్లలో ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. కానీ ఓటీటీలోకి వచ్చేసిన రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో బ్రహ్మాణ కుటుంబం నుంచి వచ్చిన నయనతార గొప్ప చెఫ్ కావాలని కలలు కంటుంది. కుటుంబీకులు వ్యతిరేకించినా కుటుంబానికి తెలియకుండానే చదువుకుంటుంది. అయితే కాలేజీలో నాన్ వెజ్ వండాలంటే సందేహిస్తుంది. ఆ సమయంలో తన స్నహేతుడు ఫర్జాన్ పాత్రలో కనిపించిన జై.. రాముడు కూడా మాంసాహారం తింటాడు అని డైలాగ్ చెప్తాడు. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ డైలాగ్ అంతగా ఎవరు పట్టించుకోలేదు.
కానీ ఓటీటీలో విడుదలయ్యాక మాత్రం ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. రాముడి పై చెప్పిన డైలాగ్ పై ఆగ్రహం వ్యక్తమయ్యింది. ముంబైకి చెందిన శివసేన మాజీ నేత రమేష్ సోలంకి అన్నపూరణి టీం పై, నెట్ ఫ్లిక్స్ పై ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే క్షమాపణలు చెప్పిన నెట్ ఫ్లిక్స్ అన్నపూరణి సినిమాను తొలగించింది. సంబంధిత సన్నివేశాలను సవరించిన తర్వాత సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే సెన్సార్ పూర్తైన సినిమాను మళ్లీ ఎడిట్ చేయడం భావ ప్రకటనా స్వేచ్చకు విరుద్ధమని పలువురు వాదించారు. చాలా మంది సెలబ్రేటీలు నయనతారకు మద్దతుగా నిలిచారు.
తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ సైతం నెట్ ఫ్లిక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. “భారత దేశంలో సినిమా దర్శకులకు సెన్సార్ లేని ఆలోచన, స్వేచ్చ ఉండదు. సెన్సార్ కమిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన సినిమాను ఇలా ఓటీటీ నుంచి తొలగించడం చిత్రపరిశ్రమకు మంచిది కాదు. ఒక సినిమాను ప్రదర్శించడానికి.. అనుమతించడానికి లేదా తిరస్కరించడానికి కేవలం సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలు సెన్సార్ కమిటీ అధికారాన్నే ప్రశ్నార్థకం చేస్తాయి. ఇలాంటి నిర్ణయాలు సినీ పరిశ్రమకు అసలు మంచిది కాదు” అంటూ చెప్పుకొచ్చారు. అన్నపూరణి వివాదంపై స్పందించిన మొదటి డైరెక్టర్ వెట్రిమారన్ కావడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.