
‘పెద్ది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సీ17. పుష్ప 2 తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండడంతో ఆర్సీ 17పై భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం, పుష్ప, పుష్ప 2 నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నే ఇప్పుడీ RC17 సినిమాను కూడా నిర్మిస్తోంది. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించనున్నట్ తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారంలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్. ఈ ఏడాది ఆఖరులో డిసెంబర్ నుంచి ఆర్సీ 17 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కియారా అద్వానీ పేరు బాగా వినిపించింది. అలాగే జాన్వీ కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ రామ్ చరణ్ సినిమాలో నటించడం లేదు.
ఆర్ సీ 17 సినిమా కోసం ధురంధర్ సినిమా హీరోయిన్ సారా అర్జున్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ధురంధర్’ విడుదల తర్వాత సినిమాల ఎంపిక విషయంలో సారా అర్జున్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కొత్త సినిమాలు వేటికీ సంతకం చేయలేదు. అయితే సుకుమార్ స్క్రిప్ట్, అందులోని హీరోయిన్ క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట అందాల తార. త్వరలోనే దీనిపై కూడా ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు ‘పెద్ది’ విడుదల తర్వాత రామ్ చరణ్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు గాయం నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారని సమాచారం. సుకుమార్ సినిమా స్టార్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.