
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు వచ్చారు, వెళ్లారు. కానీ కొందరు మాత్రమే తమ విలక్షణమైన రూపంతో, మేనరిజంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారిలో చిడతల అప్పారావు ఒకరు. కోల ముఖం, బక్కపల్చటి శరీరం, చూడగానే నవ్వు తెప్పించే ఆకారం ఆయన సొంతం. ఆయన తెరపై కనిపిస్తే చాలు, థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. రాజమండ్రిలో పుట్టిన అప్పారావు నటనపై మక్కువతో మద్రాసు రైలెక్కినప్పుడు ఆయనతో పాటు రాజబాబు, జయకృష్ణ లాంటివారు కూడా ఉన్నారు. రాజబాబు అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోగా, అప్పారావు మాత్రం చిన్న చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఏనాడూ ఆయన తన స్థాయి గురించి బాధపడలేదు.
చిడతల అప్పారావు వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయనకు మొహమాటం ఎక్కువ. పారితోషికం విషయంలో ఎప్పుడూ పేచీ పెట్టేవారు కాదు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. కేవలం నటనపైనే ఆధారపడితే బతకడం కష్టమని భావించి, ఆయన మేకప్ విభాగంలో కూడా పనిచేశారు. ఎంతోమంది నటీనటులకు మేకప్ వేస్తూ, ఖాళీ లేకుండా కష్టపడేవారు. 1951లో ‘పెంకి పిల్ల’ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం కొన్ని వందల సినిమాల వరకు సాగింది. రాజేంద్ర ప్రసాద్‌తో ఆయన పండించిన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో అప్పారావుకి మంచి పాత్రలు దక్కేవి.
ఆయన కేవలం నటుడే కాదు, గొప్ప దానశీలి కూడా. తన దగ్గరకు సాయం కోసం ఎవరు వచ్చినా లేదనకుండా తన వద్ద ఉన్నంతలో ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. తోటి కళాకారులు ఇబ్బందుల్లో ఉంటే తన జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చే మనసు ఆయనది. అభిమానులు ఫోటోల కోసం వస్తే, ఎంత ఒత్తిడిలో ఉన్నా వారితో సరదాగా జోకులు వేస్తూ భోజనం పెట్టి పంపేవారు. అప్పారావుకి రాజబాబు లాగే ఇద్దరు భార్యలు. మొదటి భార్య మరణాంతరం దుర్గని వివాహం చేసుకున్నారు.
అయితే, విధి చాలా విచిత్రమైనది. అందరినీ నవ్వించిన ఆ మనిషి చివరి రోజుల్లో క్యాన్సర్ బారిన పడ్డారు. ఆర్థికంగా అంతగా వెనకేసుకోకపోవడంతో ఇండస్ట్రీలోని వారు ఆయనకు అండగా నిలిచారు. చలాకీగా నవ్వుతూ ఉండే మనిషి వ్యాధి వల్ల పూర్తిగా చిక్కిపోవడం చూసి అప్పట్లో అందరూ కన్నీరు పెట్టుకున్నారు. సుమారు 50 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు సేవ చేసిన ఆయన, చెప్పుకోదగ్గ ఆస్తులేమీ సంపాదించకపోయినా, పది మంది అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన పాత్రలు నేటికీ మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. అప్పారావు జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే.. ఉన్నంతలో తృప్తిగా బతకడం, తోటి వారికి సాయం చేయడం.