AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో వేషం అంటే అంత సులువు అనుకున్నావా..? వెళ్ళిపో అన్నారు కానీ నేను వినలేదు: చలపతి రావు

నటుడు చలపతిరావు సుదీర్ఘ సినీ ప్రస్థానం, దివంగత ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధం, నాటి సినీ స్వర్ణయుగపు విలువలను ఈ కథనం వివరిస్తుంది. నాటకాల నుండి వెండితెరపై గుర్తింపు సాధించడం, ఎన్టీఆర్‌ను కలిసి సినిమాల్లో అవకాశం పొందడం వెనకున్న పట్టుదల, కృషిని తెలియజేస్తుంది. అప్పటి నటుల అంకితభావం, సినీ పరిశ్రమలోని వృత్తి నైపుణ్యం, 'ఈ సినిమా మనది' అనే భావన వంటి అరుదైన విషయాలను చలపతిరావు మాటల్లో తెలుసుకుందాం.

సినిమాల్లో వేషం అంటే అంత సులువు అనుకున్నావా..? వెళ్ళిపో అన్నారు  కానీ నేను వినలేదు: చలపతి రావు
Chalapathi Rao
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2026 | 1:02 PM

Share

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటుడు చలపతి రావు. విలన్ గా, ఆతర్వాత తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన మరణాన్ని తెలుగు సినిమాల ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దివంగత నందమూరి తారక రామారావుగారితో ఏర్పడిన అనుబంధాన్ని, నాటి సినీ రంగ స్వర్ణయుగంలోని విలువలను వివరించారు. నాటక రంగం నుండి వెండితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చలపతి రావు, తన తొలి అడుగుల నుంచి నేటి తరం సినీ పరిశ్రమ వరకు ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఎనలేని ఆసక్తి పెంచుకున్న చలపతి రావు, దాదాపు వందకు పైగా నాటికలు, నాటకాలు ప్రదర్శించి పేరు సంపాదించారు.

ఈ క్రమంలో చదువును సైతం పక్కన పెట్టాల్సి వచ్చిందని, రిహార్సల్స్ కోసం స్కూల్, కాలేజీల నుంచి లాక్కువెళ్ళేవారని గుర్తుచేసుకున్నారు. బీఎస్‌సీ చదువుతూ ఉండగానే నాటకాలపై దృష్టి పెట్టి, సినిమా అవకాశాల కోసం మద్రాస్‌కు పయనమయ్యారు. అప్పట్లో సినీ రంగ ప్రవేశం ఎంత కష్టమో, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక పెద్ద స్టార్‌ను కలవడం ఎంత అసాధ్యమో ఆయన వివరించారు. వాహిని స్టూడియో గేటు వద్ద సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్లడం అసాధ్యంగా ఉండేదని, ఎన్టీఆర్, జమున, సావిత్రి వంటి నటులను కారుల్లో చూసి కేవలం కేకలు వేయడమే తప్ప, దగ్గరగా కలవడం కష్టమని తెలిపారు.

ఎన్టీఆర్ గారితో తన తొలి పరిచయాన్ని చలపతి రావు ఆసక్తికరంగా వివరించారు. ఎన్టీఆర్ ఉదయాన్నే 3:30 గంటలకు నిద్ర లేచి, వ్యాయామం చేసి, రెడీ అయిన అనంతరం టిఫిన్ చేసి, 5 గంటలకే తన ఇంట్లో కూర్చునేవారని, అప్పుడు ఐదారు బస్సుల్లో టూరిస్టులు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి, కొబ్బరికాయలు కొట్టి, హారతి ఇచ్చి ఆనందంగా వెళ్ళిపోయేవారని తెలిపారు. దాని ద్వారా ఎన్టీఆర్‌ను కలవవచ్చని తెలుసుకున్న చలపతి రావు, అదే విధంగా ఆయన ఇంటికి వెళ్లి నమస్కరించారు. “ఎవరు నువ్వు?” అని ఎన్టీఆర్ అడగగా, తాను నటుడిని, సినిమాల్లో వేషాల కోసం వచ్చానని చలపతి రావు చెప్పారట. దానికి ఎన్టీఆర్ నవ్వి, “సినిమాల్లో వేషం అంటే అంత సులువు అనుకున్నావా.? వెళ్లి చదువుకో” అని సలహా ఇచ్చి పంపించేశారట. అయినప్పటికీ పట్టు వదలని చలపతి రావు నాలుగు రోజుల తర్వాత మళ్లీ అదే విధంగా వెళ్లారు. “నిన్ను వెళ్లిపొమ్మని చెప్పాను కదా, చదువుకోమన్నాను కదా” అని ఎన్టీఆర్ గుర్తుపట్టగా, “నేను వెనక్కి వెళ్ళను, సినిమాలు చేయకుండా ఉండలేను” అని చలపతి రావు గట్టిగా చెప్పారట. ఈ మొండితనాన్ని మెచ్చిన ఎన్టీఆర్, అప్పుడు జరుగుతున్న “కథానాయకుడు” చిత్రంలో (ఎన్టీఆర్, జయలలిత ప్రధాన పాత్రల్లో) ఎలక్షన్ ఆఫీసర్ పాత్రకు చలపతి రావుకు అవకాశం కల్పించారట. ఒకే టేక్‌లో డైలాగులు చెప్పి, ఎన్టీఆర్, దర్శకుడు హేమాంబరధర రావు, నిర్మాత గోపాలకృష్ణల ప్రశంసలు పొందారట. ఆ చిత్రానికి ఆయనకు అప్పట్లో గౌరవంగా భావించే రూ.116 పారితోషికం లభించిందని చలపతిరావు అన్నారు. .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us