
చిన్నప్పటి నుంచి నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు మహేశ్ బాబు. ప్రజంట్ ఆయన రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు. అయితే గతంలో మహేశ్ ఓ చిన్న నటుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అతని నటనా సామర్థ్యాన్ని కొనియాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఖలేజా సినిమాను ఫుణెలో చిత్రీకరిస్తూ ఉండగా.. ఓ పాటకు సంబంధించిన ఎమోషనల్ మూమెంట్ క్యాప్చూర్ చేసే సందర్భంలో చైతన్య అనే యాక్టర్ తన అద్భుతమైన నటనతో మహేశ్‌ను ఆకట్టుకున్నాడు. ఒక భావోద్వేగ దృశ్యంలో అతను మహేశ్ చేతిని పట్టుకొని ఏడవాల్సి ఉంది. షాట్ సెట్ చేసి, గ్లిజరిన్ తెమ్మని మహేశ్ మూవీ యూనిట్‌కు సూచించారట. చైతన్య నవ్వుతూ తనకు గ్లిజరిన్ అవసరం లేదని చెప్పారట. ఇది విన్న మహేశ్ ఆశ్చర్యపడి, చైతన్య సామర్థ్యంపై కొంత సందేహాన్ని వ్యక్తం చేశారట. ఇతనేంటి ఓవరాక్షన్ చేస్తున్నాడని మనసులో అనుకున్నారట. అయితే సీన్ స్టార్ చేసి.. మ్యూజిక్ ప్రారంభం కాగానే, చైతన్య కళ్ల నుంచి నిజమైన కన్నీళ్లు అప్రయత్నంగా కారాయి. ఆయన గ్లిజరిన్ సహాయం లేకుండానే అత్యంత సహజంగా ఏడ్చి, సన్నివేశానికి ప్రాణం పోశారు. ఈ సంఘటనను చూసిన మహేశ్.., “నేను అలాంటి నటుడిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అది షాకింగ్‌గా ఉంది, నమ్మశక్యం కాని నటన” అని పేర్కొన్నారు. ఆయన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచిందని ఆయన తెలియజేశారు. అయితే మహేశ్‌తో పాటు చిత్ర యూనిట్‌ను, ఆడియెన్స్‌ను ఇంతలా ఇంప్రెస్ చేసిన ఈ నటుడు ఆ తర్వాత కాలంలో ఎందుకో తెరమరుగు అయ్యారు.