Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఇబ్బందులు, కష్టాల గురించి బయట పెద్దగా మాట్లాడరు. కుటుంబ సభ్యులతో తప్పితే మిగతా వారితోనూ చర్చించరు. కానీ ఈ అందాల తార మాత్రం తల్లిగా మారేందుకు తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదననను ఎలాంటి సంకోచం లేకుండా బయట పెట్టింది.

Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు అమ్మ కల నిజం చేసుకున్న హీరోయిన్
Bollywood Actress

Updated on: Jul 24, 2026 | 10:13 PM

అమ్మతనంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ ‘అమ్మ’ అనే పిలుపు కోసం తెగ ఆరాట పడుతుంటారు. అయితే ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్, వాతావరణ కాలుష్యం, ఇతర పరిస్థితులతో చాలామంది మహిళలు అమ్మ అనే పిలుపునకు నోచుకోలేకపోతున్నారు. అనారోగ్యం, హర్మోన్ల ప్రభావంతో సంతానానికి దూరమవుతున్నారు. దీంతో ఎలాగైనా అమ్మవ్వాలన్నే తలంపుతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక ప్రముఖ హీరోయిన్ తల్లిగా మారేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 సార్లు ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయించుకుందట. చికిత్సలో భాగంగా ఏకంగా 1000కిపైగా ఇంజెక్షన్లు తీసుకుందట. ఈ ప్రయాణంలో రెండు సార్లు అబార్షన్ కూడా అయ్యిందట. ఇలా ఎన్నో ఆటు పోట్లు చూసిన తర్వాతే ఈ అందాల తార మాతృత్వాన్ని ఆస్వాదించిందట. ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారా?

తేజస్విని కొల్హాపురి.. తెలుగు ఆడియెన్స్ కు ఈ నటి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ హిందీ సినిమాలు, సీరియల్స్ చూసే వారికి ఈ బ్యూటీ బాగా పరిచయమే. ఈ అమ్మడు ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి సోదరి. అలాగే బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్, నటుడు సిద్ధాంత్ కపూర్లకు స్వయానా మేనత్త. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్ల నటించిన ఆమె ప్రముఖ ఫిల్మ్ మేకర్, నటుడు పంకజ్ సరస్వత్ ను వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన ఎనిమిదేళ్లకు కానీ ఆమెకు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అమ్మ అని పిలిపించుకునేందుకు తాను పడిన కష్టాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది తేజస్విని.

ఇవి కూడా చదవండి

‘నేను మొత్తం ఐదు సార్లు ఐవీఎఫ్ చికిత్స చేయించుకున్నాను. మొదటి రెండు ప్రయత్నాలు చాలా కఠినంగా అనిపించాయి. ఆ తర్వాతి ప్రయత్నాలకు మానసికంగా అలవాటు పడినా, ప్రతి దశలోనూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాన్నాను. వారం, పదిరోజులకోసారి ఆసుపత్రికి వెళ్లి ఇంజెక్షన్లు తీసుకోవడం, పరీక్షలు చేయించుకోవడం, ఫలితాల కోసం ఎదురుచూడడం నా జీవితంలో ఎంతో బాధాకరమైన అనుభవం. ఐవీఎఫ్ చికిత్సలో భాగంగా 1000కిపైగా హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఇంజెక్షన్ల ప్రభావంతో తన శరీరాకృతి పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు నేను ఎలా ఉండేదాన్నో, ఇప్పుడు పూర్తిగా వేరే వ్యక్తిలా మారిపోయాను. అయితే మానసికంగా మాత్రం చాలా బలంగా తయారయ్యాను. కానీ శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రతి ప్రయత్నం విఫలమైనప్పుడు ఆశలు కూలిపోతాయి. ముఖ్యంగా మిస్ క్యారేజీల తర్వాత మానసికంగా పూర్తిగా విరిగిపోయాను. అయినప్పటికీ ఆశను వదలకుండా మళ్లీ ప్రయత్నించాను. చివరకు ఐదో ఐవీఎఫ్ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. నేను అమ్మగా ప్రమోషన్ పొందాను’. నేటి తరం అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఏంటంటే.. సాధ్యమైనంత వరకు 35 ఏళ్లలోపే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి. నేను చాలా ఆలస్యంగా ఆ నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఇంత కష్టమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చింది తేజస్విని. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

తేజస్విని లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us