
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన హైదరాబాద్ లోనే చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. అయితే 2004 తర్వాత పూర్తి స్థాయి జ్యోతిష్కుడిగా మారారు వేణు స్వామి. అప్పటి నుంచే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జాతకాలు చెబుతూ వివాదాలు, వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువరు సెలబ్రిటీల జీవితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో చిక్కుకున్నారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. ‘సిద్ధిపేట జిల్లా నాచారం ప్రాంతంలో పుట్టి పెరిగాను. నాన్న నరసింహస్వామి ఆలయంలో పూజారిగా, జ్యోతిష్యంలో పండితుడిగా పని చేశారు. అయితే 1987లో నా పదకొండేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. దీంతో కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి. నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో కేవలం పదిహేను, ఇరవై రూపాయలే ఉన్నాయి. ఆ తర్వాత అన్న దగ్గర ఉంటూ చదువుకుంటూనే పూజలు చేస్తూ చిన్న వయసులోనే సంపాదన మొదలుపెట్టాను. హైదరాబాద్‌లో చదువుకుంటూనే ‘ప్రాణ స్నేహితులు’ లాంటి ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. అలా సుమారు 2000 నుంచి 2004 వరకు సినిమా ఇండస్ట్రీతోనే ఉన్నాను. అయితే ఆ తర్వాతే పూర్తిస్థాయి జ్యోతిష్యం వైపు వచ్చాను’
‘ హైదరాబాద్ లో 2001లో స్నేహితుడు శ్యామ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్నాను. ఆ రోజుల్లో తినడానికి డబ్బులు లేక రెండు ప్లేట్ల ఇడ్లీలతో రోజంతా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఉదయం ఒక ఇడ్లీ, మధ్యాహ్నం మిగిలినవి తిని, రాత్రికి సాంబార్లో నీళ్లు కలుపుకుని తాగేవాళ్లం. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు విదేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చే స్థాయికి ఎదిగాను. నాకు మొదటి నుంచీ కింగ్ కావడం కంటే కింగ్ మేకర్‌గా ఉండటమే ఇష్టం. వామాచారం, దశమహావిద్యల కోసం కామాఖ్య వెళ్లి వంద రోజుల దీక్ష చేశాను. ఇక నా దగ్గరకు వచ్చే ప్రముఖుల విషయాల్లో దాదాపు 99 శాతం సీక్రెట్ మెయింటేన్ చేస్తాను. భార్యతో కూడా క్లయింట్ల విషయాలు పంచుకోను’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడూ సంతోషంగా, లగ్జరీగా కనిపించే వేణు స్వామి జీవితంలోనూ ఇన్ని కష్టాలున్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.