ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ సాధిస్తోంది. ఇటీవలే కార్తికేయ2 సినిమాతో మంచి హిట్ అందుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. అలాగే తాజాగా మరోసారి నిఖిల్ తో జతకట్టిన 18 పేజెస్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంత చేసుకుంది. ఇలా వరుస హిట్స్ అందుకున్న అనుపమ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బటర్ ఫ్లై అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది అనుపమ . ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఘంటా సతీష్ బాబు
దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అనుపమా కెరీర్ లో ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో అనుపమ ఓ పాటను పాడారు. ఆదివారం హైదరాబాద్ లో చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ..
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ…గతేడాది ఇదే డిసెంబర్ టైమ్ లో సినిమా షూటింగ్ ప్రారంభించాం. దాదాపు నెలరోజుల్లో కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఏడాది టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశారు. ఈ చిత్రంలో నేను గీత అనే పాత్రలో కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. గీత క్యారెక్టర్ లో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇన్వాల్వ్ అయి చేశాను. నాకు ఈ ఏడాది సెకండాఫ్ చాలా బాగుంది. కార్తికేయ 2, 18 పేజెస్ హిట్ అయ్యాయి. ఇప్పుడు బటర్ ఫ్లై రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో రావడం సంతోషంగా ఉంది. సకుటుంబ ప్రేక్షకులు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మా సినిమాను ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చింది అనుపమ.