
నటి కని కుస్రుతి.. గత మూడు వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాతో ఈ భామ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాకు గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పాయల్ కపాడియా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మలయాళీ నటి కని కుస్రుతి కీలకపాత్ర పోషించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న కని కుస్రుతి..ఆ వేడుకలలో పుచ్చకాయను పోలి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కని కుస్రుతి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది. సినిమాల్లో నటించిన ప్రారంభించిన తొలినాళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. డబ్బు సంపాదించి స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాను ప్రశాంతంగా ఉండగలనని తెలిపింది.
“ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. జీవనోపాధి కోసమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళీ సినిమా బిరియానికి కేరల స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డ్ వచ్చాయి. కానీ అంతకుముందు నా జీవితం మొత్తం కన్నీళ్లతోనే పోరాటమే చేశాను. నా దగ్గర డబ్బులేని సమయంలో సజిన్ బాబు నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఈ సినిమాలో నటించలేను.. ఎందుకంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాను. ఆ సినిమా కోసం మరొకరిని వెతకండి అని సలహా ఇచ్చాను. అప్పుడు నాకు డబ్బు చాలా అవసరం అయినా.. ఆ సినిమాను వదిలేసుకున్నాను. కానీ మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారు. అప్పుడు ఆ సినిమా చేయడానికి డబ్బు లేదు. కానీ నా దగ్గర డబ్బు కూడా లేదు. బిరియాని సినిమా చేసేందుకు రూ.70వేలు ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో అది నాకు చాలా ఎక్కువ. ఆ సమయంలో నా అకౌంట్లో కేవలం 3 వేలు మాత్రమే ఉన్నాయి.” అంటూ తన కష్టాలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది కని కుస్రుతి.
తాను థియేటర్ కే పరిమితమై ఉంటే బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని అన్నారు కని కుస్రుతి. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకపోతే మళ్లీ తనకు ఇష్టంలేని పనులు చేయ్యొచ్చు అని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చరిత్ర సృష్టించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా ముంబైలో నివసిస్తున్న ఇద్దరు మలయాళీ నర్సుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో దివ్యప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నెడుమంగడ్, టింటుమోల్ జోసెఫ్ కీలకపాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.