
ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను కవ్వించింది ముద్దుగుమ్మ నమిత. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు నమిత. గతంలో నమిత ఓ ఇంటర్వ్యూలో తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి, అలాగే సోషల్ మీడియాలో ఎదురయ్యే వ్యక్తిగత విమర్శలను ఎలా ఎదుర్కోవాలో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తమిళ్ లో ఆమె పాల్గొన్నారు. కాగా నమిత మాట్లాడుతూ.. హౌస్‌లో రెండు ప్రధాన మార్గాలున్నాయని నమిత పేర్కొన్నారు. మొదటిది, తమ సహజ స్వభావంతో ఉండటం, అయితే దీనికి అవమానాలు, నిందలు, కించపరచబడటానికి సిద్ధంగా ఉండాలి. రెండో మార్గం, చాకచక్యంగా, తెలివిగా వ్యవహరించి, ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని అందించడం.. అంటే మూడు నెలల పాటు నిరంతరం నటించడం. ఏడుస్తూ ప్రజల సానుభూతిని పొందడం లేదా డ్యాన్స్ చేస్తూ వారి హృదయాలను గెలుచుకోవడం, అయితే నిజాయితీగా ఉంటే ప్రజలు అంగీకరించకపోవచ్చని ఆమె వివరించారు. తన విషయానికి వస్తే, తన స్నేహితులను లేదా తన ప్రజలను ఎవరైనా వేధించినప్పుడు తాను కేవలం తన కోసం మాత్రమే కాకుండా వారి కోసం కూడా నిలబడతానని ఆమె ధైర్యంగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన కామెంట్లను, వాటికి ఆమె ఎలా స్పందించారో కూడా నమిత పంచుకున్నారు. మొదట్లో తన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తన భర్త ఇన్‌స్టాగ్రామ్ కామెంట్లను బ్లాక్ చేయమని సూచించారని, తాను తప్పు చేయనప్పుడు ఇతరుల దూషణలను భరించడం కష్టమని ఆమె తెలిపారు. అయితే, కొన్ని రోజుల తర్వాత తాను పిరికిదాన్ని కానని, తప్పు చేయనప్పుడు నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆమె అనేక మందికి వివరించడానికి ప్రయత్నించగా, కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు చేసుకోలేకపోయారని తెలిపింది నమిత.
తనకు ఎదురైన కామెంట్లు చాలా నీచంగా, అసభ్యకరంగా ఉన్నాయని నమిత వెల్లడించారు. “మీ తల్లి క్యాన్సర్‌తో చనిపోవాలి” లేదా మీ పెంపుడు జంతువులు, మీ పిల్లలు చనిపోవాలి అని కొందరు కామెంట్లు చేశారని, అవి చాలా బాధాకరమైనవని అన్నారు. అలాంటి కామెంట్లను మొదటిసారి చదివినప్పుడు చాలా ఏడ్చానని చెప్పారు నమిత. బిగ్ బాస్ ఇంట్లో జరిగే చిన్నచిన్న విషయాలను ప్రజలు అతిగా చూపిస్తున్నారని, అది కేవలం కొన్ని రోజులు కలిసి ఉన్న వ్యక్తుల మధ్య సాధారణ మానవ ప్రవర్తన అని టీవీలో చూపించే ఒకటిన్నర గంటల షో మాత్రమే చూసి 24 గంటల వాస్తవికతను అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజలు ఒకరి గురించి కామెంట్స్ చేసే ముందు వారి స్థానంలో నిలబడి ఆలోచించాలని నమిత తెలిపింది. తన పిల్లలు, కుటుంబం, స్నేహితుల జోలికి వస్తే తాను క్షమించబోనని ఆమె గట్టిగా చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.